కలం, ఖమ్మం బ్యూరో: సరదాగా ఈతకు వెళ్లిన ఒక యువకుడు నీటి లోతును అంచనా వేయలేక ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన డోర్నకల్ శివారులోని మున్నేరు బ్రిడ్జి (Munneru Tragedy) సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన గడ్డం బాలరాజు (23) తన స్నేహితులతో కలిసి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కమలాపురంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం వీరంతా సరదాగా డోర్నకల్ శివారులో ఉన్న మున్నేరు వాగు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు.
నీటిలోకి దిగిన బాలరాజు, అక్కడి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న డోర్నకల్ సీఐ చంద్రమౌళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిండు నూరేళ్ల వయసున్న యువకుడు కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో రుద్రంపూర్‌లో శోకఛాయలు అలముకున్నాయి.

