ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వయోవృద్ధుల సంరక్షణ వారోత్సవాలు

కలం, ఖమ్మం బ్యూరో: వృద్ధాప్యం అంటే కేవలం సమాజం ఇచ్చే పింఛన్ డబ్బులతో గడిపే సమయం కాదు.. జీవిత చరమాంకంలో వారు పొందే ఆత్మగౌరవం, పొందే భద్రతే అసలైన సంక్షేమం! వయస్సుకు తగిన గౌరవాన్ని ఇస్తూ, వారి మనస్సుకు కొండంత భరోసానివ్వడమే ధ్యేయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ఒక బృహత్తర మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నుండి అక్టోబర్ 1 వరకు జిల్లావ్యాప్తంగా “వయోవృద్ధుల సంరక్షణ – సాధికారత వారోత్సవాలు” (Elderly Care Week) అధికారికంగా ప్రారంభమయ్యాయి. ​జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాల మేరకు రూపొందిన ఈ సమగ్ర కార్యాచరణ పోస్టర్‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినాతో కలిసి ఆవిష్కరించారు. వయోవృద్ధులను సంరక్షించడం దయతో చేసే సాయం ఎంతమాత్రం కాదని, అది పాలనా యంత్రాంగంతో పాటు సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత అని అధికారులు ఈ సందర్భంగా చాటిచెప్పారు.

ఆసుపత్రి నుంచి ఆశ్రమం వరకు..

ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వృద్ధులపై జరిగే వేధింపులకు చెక్ పెట్టేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వారికి ఉన్న చట్టపరమైన రక్షణల వివరాలతో సమాచార బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, వారి ఆరోగ్య భద్రత కోసం ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల ద్వారా ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలోని ఆరు వృద్ధాశ్రమాలలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు నేరుగా తనిఖీలు చేసి, అక్కడి పెద్దలకు కనీస వసతులు, పరిశుభ్రత అందుతున్నాయో లేదో నిరంతరం సమీక్షిస్తున్నారు.

డిజిటల్ వెలుగులు.. తరాల అనుబంధాలు

మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దలను సైబర్ నేరాల నుండి కాపాడేందుకు ప్రత్యేక డిజిటల్ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం, బ్యాంకింగ్, ఓటీపీ, యూపీఐ భద్రతా నియమాలను వారికి సులువుగా నేర్పిస్తున్నారు. మరోవైపు, నేటి వేగవంతమైన ప్రపంచంలో క్షీణిస్తున్న కుటుంబ అనుబంధాలను పునరుద్ధరించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను వారి తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో మమేకం చేసే ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి, పాత కొత్త తరాల మధ్య గౌరవ మర్యాదలను, ప్రేమానురాగాలను పెంపొందించే అద్భుతమైన వారధిని నిర్మిస్తున్నారు.

యోగా, వాకథాన్‌లతో చైతన్యం.. సన్మానంతో గౌరవం

వారోత్సవాల ముగింపు దశలో పెద్దల శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగా, ప్రాణాయామ ప్రదర్శనలు, సమాజంలో చైతన్యం తెచ్చేలా ‘వాకథాన్’ ర్యాలీలు, సంక్షేమ ప్రతిజ్ఞా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. చివరిగా అక్టోబర్ 01న జరిగే ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం’ వేడుకల్లో సమాజానికి సేవ చేసిన సీనియర్ సిటిజన్లను, వారి సంక్షేమానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రతినిధులను అధికారికంగా సన్మానించనున్నారు.​ఈ విస్తృత స్థాయి కార్యాచరణ ద్వారా ప్రతి సీనియర్ సిటిజన్‌కు భద్రతతో కూడిన ఆత్మగౌరవాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యంమని స్పష్టమవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>