వయోవృద్ధులకు అండగా ప్రత్యేక వారోత్సవాలు

కలం, ఖమ్మం బ్యూరో: వయోవృద్ధులకు సంక్షేమంతో(Senior Citizen Welfare) పాటు ఆత్మగౌరవం, భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నుంచి అక్టోబర్ 1 వరకు జిల్లావ్యాప్తంగా ‘వయోవృద్ధుల సంరక్షణ, సాధికారత వారోత్సవాలు’ నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రూపొందించిన వారోత్సవాల కార్యాచరణ పోస్టర్‌ను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. పద్మావతి, జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినాతో కలిసి ఆవిష్కరించారు. వయోవృద్ధుల సంరక్షణ ప్రభుత్వంతో పాటు సమాజం, కుటుంబాల బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.

వృద్ధులకు చట్టపరమైన రక్షణ

వృద్ధులపై వేధింపులను అరికట్టేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వయోవృద్ధులకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలపై సమాచార బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. వారి ఆరోగ్య భద్రత కోసం ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల ద్వారా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. జిల్లాలోని ఆరు వృద్ధాశ్రమాలను సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తనిఖీ చేసి వృద్ధులకు కనీస వసతులు, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలు అందుతున్నాయా లేదా సమీక్షించనున్నారు.

సైబర్ నేరాలపై అవగాహన

వృద్ధులను సైబర్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రత్యేక డిజిటల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఓటీపీ, యూపీఐ లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై వారికి అవగాహన కల్పించనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను వారి తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలతో మమేకం చేయనున్నారు. తరాల మధ్య అనుబంధాలు, గౌరవం, ఆత్మీయత పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

యోగా, వాకథాన్‌లతో చైతన్యం

వారోత్సవాల్లో భాగంగా వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా, ప్రాణాయామ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సమాజంలో వయోవృద్ధుల హక్కులు, సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు వాకథాన్ ర్యాలీలు, సంక్షేమ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో సమాజ సేవలో విశేషంగా పనిచేసిన సీనియర్ సిటిజన్లతో పాటు వృద్ధుల సంక్షేమానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సన్మానించనున్నారు. ప్రతి వయోవృద్ధుడికి భద్రతతో కూడిన ఆత్మగౌరవం కల్పించడమే ఈ విస్తృత కార్యాచరణ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>