కలం, కరీంనగర్: ఈ నెల 30న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ లో నిర్మించిన నూతన సమగ్ర జిల్లా కార్యాలయాల (Karimnagar New Collectorate) భవన ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం పర్యటనను పురస్కరించుకుని ఆదివారం రోజు జిల్లా యంత్రాగంతో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నూతన కలెక్టరేట్ ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంతో పాటు చుట్ట పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు (లైటింగ్), వాహానాల పార్కింగ్ వసతులను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.
ప్రారంభోత్సవ సమయానికి ఎలాంటి లోటు పాట్లు లేకుండా కలెక్టరెట్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పారిశుధ్య విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్.. నగర పరిసరాల పరిశుభ్రత, నూతన కార్యాలయ ప్రాంగణంలో మెరుగైన వసతి సౌకర్యాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లా యంత్రాగం సమన్వయంతో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది మెరుగైన ఏర్పాట్లు పూర్తి చేసి ప్రారంభోత్సవం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈలు వెంకటేశ్వర్లు, దేవేంధర్ రెడ్డి, ఏఈలు, పారిశుధ్య విభాగం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

