లక్ష్మణ్ బాపూజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని, సర్వస్వాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.

 గొప్ప రాజకీయ కర్మశీలి బాపూజీ..

తెలంగాణ కోసం పోరాడుతున్న సమయంలో ఎలాంటి పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆశపడకుండా తన శక్తినంతా రాష్ట్ర సాధనకే ధారపోసిన గొప్ప రాజకీయ కర్మశీలి బాపూజీ అని యెన్నం (Yennam Srinivas Reddy) కొనియాడారు. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా నిజాయితీ, నిబద్ధత, త్యాగం, ఆత్మగౌరవానికి ప్రతిరూపంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నాటి ఉద్యమ సమయంలో తన ఇంటినే వేదికగా మార్చి పోరాట స్ఫూర్తిని రగిలించారని, పాలకులు ఆ ఇంటిని కూల్చివేసినా న్యాయపోరాటం చేసి వచ్చిన పరిహారాన్ని కూడా మళ్లీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసమే వెచ్చించిన త్యాగశీలి అని గుర్తుచేశారు.

ప్రజల గుండెల్లోబాపూజీ..

దేశానికి మహాత్మా గాంధీ ఎలాగో, తెలంగాణకు కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా అదే స్థాయిలో ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. బాపూజీతో కలిసి ఉద్యమంలో పాల్గొనడం తన అదృష్టమని, ఆయన చూపిన నిజాయితీ, నిష్ఠ నేటి రాజకీయ నాయకులకు, అధికారులకు గుణపాఠమని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, కార్మికుల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హరిప్రియ, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, కార్పొరేటర్లు తిరుమల వెంకటేష్, తాహేర్, రామస్వామి, ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, నాయకులు అబ్దుల్ హక్, చందు యాదవ్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>