కలం, రాజన్న సిరిసిల్ల: జిల్లా సమగ్ర అభివృద్ధిపై, అలాగే నియోజకవర్గంలోని విస్తారమైన భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంగా కేటీఆర్ పలు సూటి ప్రశ్నలు సంధించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని, నేతన్నల సంక్షేమం నుంచి మౌలిక వసతుల కల్పన వరకు ఊహించని రీతిలో అభివృద్ధి సాధించామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కేటీఆర్ సంధించిన ప్రధాన డిమాండ్లు, ప్రశ్నలు ఇలా..
8 వేల ఎకరాల భూములపై శ్వేతపత్రం
సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని దాదాపు 8,000 ఎకరాల భూములకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2,400 ఎకరాల రికవరీపై స్పష్టత ఇవ్వాలి
ఇప్పటికే 2,400 ఎకరాల భూమిని రికవరీ చేసినట్లు చెబుతున్న ప్రభుత్వం, ఆ వివరాలను బహిరంగపరచాలని సూచించారు. 8 వేల ఎకరాల భూమి ఎక్కడుంది? అందులో 2,400 ఎకరాలు ఏ భూమి? ఏ మండలం? ఏ గ్రామం? ఏ సర్వే నంబరు? ఎవరి పేరుపై ఉంది? ఎంత విస్తీర్ణం? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి
సిరిసిల్లకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాలు విసిరారు. గతంలో చేనేత, రంగుల కార్మికులకు అండగా నిలిచిన పథకాలను నిలిపివేసి నేతన్నల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
బతుకమ్మ చీరలను ప్రారంభించాం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేసిందని కేటీఆర్ తెలిపారు. స్కూల్ యూనిఫాంలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, సంక్షేమ శాఖ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లతో పాటు అనేక ప్రభుత్వ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో రూ.3,313 కోట్ల విలువైన 100 కోట్ల మీటర్ల బట్టకు పీపీ ఆర్డర్లు, టెస్కో ద్వారా ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు.

