కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్‌లోని బసవ గార్డెన్‌లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ (Color Belt Promotion Test) నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.సి. మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన టైక్వాండో క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు బసవపురం లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ.. పిల్లలు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి పెట్టాలని, ముఖ్యంగా టైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు.
ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా టైక్వాండో (Taekwondo) సాధనకు హాజరయ్యే పిల్లలు రోజంతా చురుకుగా ఉండటంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా బాలికలు టైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యను నేర్చుకొని తమను తాము రక్షించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రమోషన్ టెస్ట్‌లో బెల్ట్ సాధించిన క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పిల్లలను క్రమం తప్పకుండా శిక్షణకు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
క్రీడాకారుల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తూ, పిల్లలకు మంచి పోషకాహారం మరియు సరైన డైట్ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తేజ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రమశిక్షణతో శిక్షణ అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రధాన కార్యదర్శి జె.సి. మనోజ్ కుమార్‌ను అతిథులు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో బ్లాక్ బెల్ట్ కోచ్‌లు గంగాధర్, నాగరాజ్, శివ, వినయ్, హనీషా, నితిన్, క్రీడాకారుల తల్లిదండ్రులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

