కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ (Nizamabad Ganesh) విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారని నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో 5811 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించడం జరిగిందని, ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 నుంచి 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేయడం జరిగిందని అన్నారు.
నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు. బాసర , ఉమ్మెడ ప్రాంతాలే కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సార్వజనిక్ గణేష్ మండలి , విగ్రహ గణేష్ కమిటీలు , మజీద్ కమిటీలు, అన్ని మతాల ప్రజలు , ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను సమర్థంగా అందించారని ప్రశంసిస్తూ వారిందరికీ సీపీ సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు.

