కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: తెలంగాణలో(Telangana) ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేయాలని తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మెట్ట యాదయ్య (Metta Yadaiah) డిమాండ్ చేశారు. శనివారం మెట్టుగడ్డలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మెట్ట యాదయ్య విమర్శించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. గతంలో నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించాలని కోరారు.
ఖాళీగా ఉన్న పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేసి డీఎస్సీ, గ్రూప్స్, కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్లుగా సిద్ధమవుతున్న యువత వయోపరిమితి దాటిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. డిసెంబర్‌లోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగ యువత తమ నిరసనను తెలియజేస్తుందని మెట్ట యాదయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ సాగర్, జిల్లా అధ్యక్షుడు అజయ్, నరసింహ, తిరుపతి, లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

