కలం, ఖమ్మం బ్యూరో: నరరూప రాక్షసుడిలా మారిన భర్త.. భార్యపై విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తాళి కట్టి తోడుగా ఉంటాడనుకుంటే.. కత్తిపీటతో మెడ కోసి హత్య చేసేందుకు తెగబడ్డాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి (Painampalli) గ్రామంలో శనివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దెల వీరలక్ష్మి (30)పై ఆమె భర్త నరసింహారావు శనివారం రాత్రి దాడికి దిగాడు. ఉన్మాదిలా ప్రవర్తిస్తూ కత్తిపీటతో భార్య మెడపై దాడి చేశాడు. దీంతో వీరలక్ష్మి రక్తపు మడుగులో కొట్టుకుంటూ కిందపడిపోయింది.
వీరలక్ష్మి అరుపులతో ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకుంటూ వచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి ఒడిగట్టిన అనంతరం నరసింహారావు పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలే కారణమా.. మరేదైనా ఉందా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

