కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో (Kondagattu Anjaneya Swamy Temple) మూడు రోజులుగా వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. పవిత్రోత్సవాల చివరి రోజు శనివారం ఉదయం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, అనంతరం పట్టు వస్త్రాలతో విశేషంగా అలంకరించారు.
యాగశాలలో అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య మూలమంత్ర హోమాలను నిర్వహించి, అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి (Maha Purnahuthi) అనంతరం యాగశాల నుంచి దేవాలయం వరకు ఉత్సవమూర్తులతో పాటు పవిత్రాలను తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి పట్టు పవిత్రాలను అలంకరించి, కుంభ ప్రోక్షణ, పవిత్ర సమర్పణ కార్యక్రమాలను ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. చివరగా వేద పండితుల ఆధ్వర్యంలో ఆశీర్వచనం కార్యక్రమం నిర్వహించడంతో పవిత్రోత్సవాలు సంపూర్ణంగా ముగిశాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, శోభాయాత్ర, పవిత్ర సమర్పణ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు పౌర్ణమి కావడంతో వేల సంఖ్యలో భక్తులు కొండగట్టు (Kondagattu) గిరి ప్రధాక్షానలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ అంజనరెడ్డి, స్థానాచార్యులు కపిందర్, సూపరింటెండెంట్, అర్చకులు, ఆలయ సిబ్బంది, నాయకులు ఎడమల పద్మా రెడ్డి, పబ్బతి విమల నారాయణ రెడ్డి, కిషన్ రెడ్డి, శ్రీనివాస్, తిరుపతి, కేశవ రెడ్డి, అరుణ, వంచ లక్ష్మి, ప్రభాకర్,పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Also Read : సింధు దూకుడు.. ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది!
Follow Us On: X(Twitter)

