కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య గడీల అహంకారాన్ని ఎదిరించి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి నిరంతర ఆదర్శమని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం గళమెత్తి నిజాం నిరంకుశ పాలనపై దండెత్తిన ధీరవనిత ఐలమ్మ (Chakali Ilamma Jayanti) అని కొనియాడారు. హక్కుల సాధనలో ఆమె ప్రదర్శించిన తెగువ, పోరాట పటిమ యువతకు ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తుందన్నారు.
బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఐలమ్మ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, శ్రీనివాస్ యాదవ్, మైత్రి యాదయ్య, రమేష్ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, కార్పొరేటర్లు ప్రవీణ్ కుమార్, రమేష్ రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

