కలం, ఆదిలాబాద్: సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతి (Chakali Ilamma Jayanti) సందర్భంగా ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆమె జీవిత చరిత్ర, పోరాటాలు, సమాజానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కోసం చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పట్టుదల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

