కలం, ఖమ్మం బ్యూరో: హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ మియార్ వ్యాలీలో 6,021 మీటర్ల ఎత్తులో ఉన్న అతి క్లిష్టమైన ‘తరంగ్-2 (శైలపుత్రి)’ పర్వతాన్ని (Tarang-2 Peak) భారతీయ పర్వతారోహకుల బృందం విజయవంతంగా అధిరోహించింది. ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయ బృందంగా వీరు రికార్డు సృష్టించారు. ఈ చారిత్రాత్మక యాత్రలో పాల్గొన్న పది మంది సభ్యుల బృందంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా పెనుబల్లికి (Penuballi) చెందిన బర్మావత్ మోతికుమార్ విశేష ప్రతిభ చాటారు.
మోతికుమార్ ఖాతాలో మరో ఘనత
ఇప్పటికే దేశ విదేశాల్లోని పలు ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించి తన ప్రతిభను చాటుకున్న మోతికుమార్, (Mothikumar) సవాలుతో కూడుకున్న ‘తరంగ్-2’ పర్వతాన్ని సఫలవంతంగా చేరుకోవడంతో ఆయన ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. మోతికుమార్ సాధించిన ఈ హిమాలయ విజయం పట్ల పెనుబల్లి ప్రాంత ప్రజలు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రతిభతో తమ ప్రాంతానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని పలువురు కొనియాడారు.

