కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఉప ఎన్నిక (Khairatabad Bypoll) తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (‘సర్’) ప్రక్రియ కూడా కీలకంగా మారింది. నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. దీంతో ఆ తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తొలుత ‘సర్’ పూర్తికాగానే గ్రేటర్ ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గుచూపుతుందని ప్రచారం జరిగినా.. దానం నాగేందర్ అనర్హతతో తాజా సమీకరణాల్లో మార్పు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ బైపోల్ తర్వాతే జీహెచ్ఎంసీ..?
దానం నాగేందర్ అనర్హతతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందున్న ప్రధాన అంశం. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. ప్రక్రియ ఒక విధాన క్రమంలో జరుగుతుంది. దాంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఫలితం హైదరాబాద్ రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఏర్పడింది. అయితే.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధారించే ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా, డీలిమిటేషన్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో గ్రేటర్ ఎన్నికలు ఖైరతాబాద్ ఉప ఎన్నిక తర్వాతే జరిగే అవకాశాలకు తాజా సమీకరణాలు బలాన్నిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సైతం ఖైరతాబాద్‌లో తమ సత్తా చాటడం ద్వారా గ్రేటర్ ఎన్నికలకు బలమైన సంకేతాలు పంపాలని భావిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం
ఖైరతాబాద్ ఉప ఎన్నిక (Khairatabad Bypoll) తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గెలుపు ధీమాతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికల్లోని రాజకీయ అనుకూల పరిస్థితులను జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలన్న వ్యూహంతో ఉందని తెలుస్తోంది. మరోవైపు జీహెచ్ఎంసీలో బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ కూడా ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ తన పట్టును కాపాడుకుంటూ వస్తోంది.
ఎమ్మెల్యే స్థానాల సంగతి ఎలా ఉన్నా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం నగర ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటం గమనార్హం. బీఆర్ఎస్ హయాంలోనూ ఇది స్పష్టమైంది. అధికార బీఆర్ఎస్, దాని మిత్రపక్షం మజ్లిస్ పార్టీలను ఎదుర్కొని 48 స్థానాలు గెలుచుకుంది. దాంతో గ్రేటర్‌పై పట్టు సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం చర్చనీయాంశమవుతోంది. గ్రేటర్ పరిధిలో బలమైన స్థానాలు, స్థానిక నాయకత్వం, ఓటర్ల సమీకరణాలపై రెండు పార్టీలు పోటాపోటీగా దృష్టి సారిస్తున్నాయి.
మేయర్ పీఠమే లక్ష్యం
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) మేయర్ పీఠం కీలక రాజకీయ లక్ష్యంగా మారింది. గ్రేటర్లో కార్పొరేటర్ స్థానాల సంఖ్య, రిజర్వేషన్లు, ఎన్నికల తుది షెడ్యూల్ వంటి అంశాలు స్పష్టమైన తర్వాతే పార్టీల వ్యూహాలు మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, 2023లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున గెలుపొందగా.. కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

