కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోలాహలంగా సాగింది. నగరంలోని రాంనగర్‌లో (Ramnagar) ప్రతిష్ఠించిన 32 అడుగుల భారీ మట్టి వినాయకుడి (Clay Ganesh Idol) నిమజ్జన యాత్ర గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. విద్యుత్ కాంతుల అలంకరణతో సాగిన శోభాయాత్రలో డోలు వాయిద్యాలు, అద్భుతమైన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మ్యూజిక్, డప్పు శబ్దాలకు అనుగుణంగా యువత, భక్తులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. పుణేకు చెందిన ‘వాల్మీకి బజరంగదళ్’ బ్యాండ్ సభ్యుల వాయిద్య ప్రదర్శన శోభాయాత్రకు మరింత ఉత్సాహాన్ని తీసుకురాగా, నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.
రాంనగర్ నుంచి ప్రారంభమైన భారీ మట్టి గణనాథుడి నిమజ్జన యాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతూ చింతకుంట జలాశయానికి చేరుకుంది. దారిపొడవునా భక్తులు గణనాథుడికి నీరాజనాలు అర్పిస్తూ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో 32 అడుగుల భారీ మట్టి గణపతి విగ్రహాన్ని చింతకుంట జలాశయంలో నిమజ్జనం చేశారు.

