కలం, జోగులాంబ గద్వాల: గద్వాల మున్సిపాలిటీ (Gadwal Municipality) పరిధిలో జరిగిన మున్సిపల్ షాపుల అద్దె వసూళ్ల సొమ్ము దుర్వినియోగంపై విచారణ చేపడుతున్నట్లు గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకీరాం సాగర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గద్వాల మున్సిపాలిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రాంప్రసాద్ మున్సిపల్ షాపుల అద్దెలు వసూళ్లు చేసి మున్సిపాలిటిలో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడాడు.
సుమారు రూ.11 లక్షలకు పైగా మున్సిపల్ కు సంబంధించిన డబ్బులను దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కమిషనర్ జానకీరాం సాగర్ అన్నారు. ఈ వ్యవహారంపై గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేసిన అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదికను సమర్పించినట్లు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మున్సిపాలిటీలోని ఇతర ఆర్థిక లావాదేవీలను, రికార్డులను కూడా సమగ్రంగా పరిశీలిస్తున్నామని, పూర్తిస్థాయి విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

