కలం, నిర్మల్ : వినాయక నిమజ్జన వేడుకలు భక్తి, సందడి, ఉత్సాహంతో సాగాల్సిన వేళ మద్యం వ్యాపారులు మాత్రం ఇదే సందర్భాన్ని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. వైన్ షాప్ లు రెండు రోజులపాటు మూసివేస్తున్న నేపథ్యంలో ముందుగానే మద్యం నిల్వలు (Illegal Liquor Stockpiling) చేసి, నిమజ్జనం సందర్భంగా అధిక ధరలకు విక్రయించేందుకు నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని కొందరు బెల్ట్‌షాపుల నిర్వాహకులు ప్రయత్నించినట్లు పోలీసుల తనిఖీల్లో వెలుగుచూసింది.
ముందుగానే నిల్వలు.. నిమజ్జనమే టార్గెట్..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైన్ షాప్ ల నుంచి గురువారం గ్రామాల్లోని బెల్ట్‌షాపులకు పెద్ద ఎత్తున మద్యం తరలించి నిల్వ చేసినట్లు తెలుస్తోంది. నిమజ్జనం సందర్భంగా మద్యం డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే స్టాక్ నిల్వ చేసుకున్నారు. సాధారణ ధర కంటే అధిక ధరలకు విక్రయించేందుకు బెల్ట్ షాప్ దుకాణదారులు సిద్ధమయ్యారు. అక్రమ మద్యం నిల్వలపై సమాచారం అందడంతో నిర్మల్ రూరల్ పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎల్లపెల్లి, న్యూ పోచంపాడ్, కొండాపూర్, వెంగ్వాపేట్, రత్నాపూర్ కాండ్లి గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో రూ. 4,32,508 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం ఇవ్వండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం: ఎస్సై లింబాద్రి
గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి సమాచారం ప్రజలకు తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని రూరల్ ఎస్సై లింబాద్రి కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించడం, బెల్ట్‌షాపులు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఎస్సై హెచ్చరించారు.

