కలం వెబ్ డెస్క్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. బీటెక్, ఎంటెక్ చదువుతూ GATE–2026 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఉచిత గేట్ కోచింగ్‌ను (GATE Coaching) ఏర్పాటు చేశారు. ప్రముఖ శిక్షణా సంస్థ ఏస్ అకాడమీ సహకారంతో ఈ శిక్షణను అందించనున్నట్లు జేఎన్టీయూ ఎస్సీ, ఎస్టీ సెల్ సమన్వయకర్త క్రాంతికిరణ్ వెల్లడించారు. ఏస్ అకాడమీ (ACE Academy) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల్లో భాగంగా, గేట్ పరీక్షలో అనుభవం కలిగిన నిపుణ అధ్యాపకులతో నాణ్యమైన శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ కోచింగ్ కార్యక్రమంలో సబ్జెక్ట్ వైజ్ తరగతులు, మాక్ టెస్టులు, మునుపటి సంవత్సరాల ప్రశ్నల విశ్లేషణ, పరీక్షా వ్యూహాలపై ప్రత్యేక మార్గదర్శనం వంటి అంశాలను సమగ్రంగా బోధించనున్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఉచిత గేట్ కోచింగ్‌ను (GATE Coaching) పొందాలనుకునే విద్యార్థులు జేఎన్టీయూ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోని ఎస్సీ/ఎస్టీ సెల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరిమిత సీట్లు ఉండటంతో అర్హులైన విద్యార్థులు త్వరగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
అసలు GATE పరీక్ష ఏంటి?
గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో ఎంటెక్, ఎంఎస్, పీహెచ్డీ వంటి ఉన్నత చదువులకు ప్రవేశాలు లభిస్తాయి. అలాగే బీఈఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఐఓసీ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా గేట్ స్కోర్ ఆధారంగా లభిస్తాయి. అంతేకాకుండా ఉన్నత చదువులకు అవసరమైన స్కాలర్షిప్లు, స్టైఫండ్లు కూడా గేట్ ద్వారా పొందవచ్చు.
ఉచితంగా, నిపుణులచే అందుతున్న ఈ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకుని GATE – 2026లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని జేఎన్టీయూ అధికారులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యా, ఉద్యోగ లక్ష్యాలను సాధించగలరని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: ఇండియాలోనే లగ్జరీ ట్రైన్.. పెళ్లి నుంచి హనీమూన్ దాకా!
Follow Us On: Youtube


