కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad)పట్టణంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి, ఎదులాపురం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జన సార్వజనిక శోభాయాత్ర శుక్రవారం శ్రీ సరస్వతి శిశు మందిర్, వినాయక్ చౌక్ నుంచి భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, వార్డు కౌన్సిలర్ ఆకుల రేవతి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు కేవలం పండుగలకే పరిమితం కాకుండా సమాజంలో ఐక్యత, భక్తిభావం, సోదరభావాన్ని పెంపొందించే గొప్ప సాంస్కృతిక సంప్రదాయమన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గణేష్ ఉత్సవాలను నిమజ్జన కార్యక్రమంతో అదే భక్తిభావంతో పూర్తి చేసుకోవాలని కోరారు. శోభాయాత్రలో సంప్రదాయ వాయిద్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని అన్నారు. సంప్రదాయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. నిమజ్జన (Ganesh Immersion Procession) శోభాయాత్ర ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు జిల్లా యంత్రాంగం, పోలీసులకు సహకరించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జన శోభాయాత్రకుసంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు సూచించిన రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
మున్సిపాలిటీ ద్వారా గత ఏడాది కంటే అధికంగా రూ.37 లక్షలు, సీసీ కెమెరాల నిర్వహణకు రూ.25 లక్షలు, రోడ్డు మరమ్మతులకు రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలను డీజేలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
భక్తులు పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు. ఈ శోభాయాత్రలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్, ఇందూర్ విభాగ్ సహ విభాగ్ ప్రచారక్ మీసరి ప్రకాష్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు లచ్చన్న, ప్రవీణ్, పట్టణ ప్రముఖులు, భక్తులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

