చదువుతోనే సమాజంలో గుర్తింపు: బక్కి వెంకటయ్య

కలం, దేవరకొండ: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లోని కొండమల్లేపల్లి మండలం డింజలాల్ తండాలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, స్టోర్ రూమ్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భోజనం, కూరగాయలు, వంటనూనె, పండ్లు, గుడ్ల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం పదో తరగతి విద్యార్థులతో ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అదనంగా వాష్‌రూమ్‌లు, కాంపౌండ్ వాల్, బోరు బావి అవసరం ఉందని చెప్పడంతో సానుకూలంగా స్పందించిన బక్కి వెంకటయ్య.. కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభలో తీర్మానం చేయించి, ఉపాధి హామీ నిధుల ద్వారా పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తరగతి గదిలోనే భవిష్యత్తుకు పునాది..

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లు తరగతి గదిలోనే విద్యార్థులు తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల విద్యార్థులు పట్టుదలతో చదివాలని ఆకాంక్షించారు. సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నందున ఎలాంటి ఆందోళన చెందకుండా చదువుపైనే శ్రద్ధ పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రేణిగుంట ప్రవీణ్, లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ తియాన్ మావి, డీటీడీవో కమలాకర్ రెడ్డి, ఆర్‌సీవో శ్రీనివాసరావు, ఏసీఎం వెంకటేశ్ నాయక్, ఏటీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ స్వర్ణలత, తహసీల్దార్ నరేందర్, ఎంపీఓ సుధీర్ కుమార్, సర్పంచి గోజి రతన్‌లాల్, ఉప సర్పంచి శ్రీకాంత్, ప్రిన్సిపల్ శారద పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>