కలం, మహబూబ్ నగర్ బ్యూరో : దేశ స్వతంత్ర పోరాటంలో కోట్లాదిమంది భారతీయులలో ఉద్యమ స్ఫూర్తిని నిలిపింది వందేమాతర గీతం అంటూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ వద్ద శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో కలసి వందే మాతరం గీతాలాపన చేశారు.
అనంతరం గణేష్ నిమజ్జనం ఉత్సవాలలో భాగంగా శోభాయాత్రలో తరలివచ్చిన గణనాధులకు ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వందేమాతరం సామూహిక గీతాలాపన (Vande Mataram Mass Singing) నిర్వహించడం గొప్ప విషయం అంటూ ఆమె కొనియాడారు. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో కోటి మందికి పైగా వందేమాతరం సామూహిక గీతాలాపనలో పాల్గొనడం చరిత్రాత్మక ఘట్ట మన్నారు.
ఏక కాలంలో వందేమాతరం సామూహిక గీతాలాపన చేయడం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నిలిచిపోతుందనీ ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వందేమాతరం గీతాలాపన లో పాల్గొన్న ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. గీత రచయిత బంకించంద్ర ఛటర్జీ వందే మాతరం గీతంలో భారతీయ సంస్కృతి, మాతృభూమి గొప్పతనాన్ని అద్భుతంగా తెలియజేశారన్నారు.
వందే మాతరం ఒక పాట కాదు.. స్వాతంత్ర్య సమరంలో పోరాడిన కోట్లాది మంది గుండెల్లో రగిలిన జ్వాల అంటూ ఆమె తెలిపారు. తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక నాదం వందే మాతరమని, వందే మాతరం గీతం పాడకూడదని నాడు బ్రిటిష్ పాలకులు ఈ గీతం పై నిషేధం విధించారనీ ఆమె తెలిపారు. వందే మాతరం అనే పదం దేశ ప్రజలలో ఎంతో స్వరాజ్య కాంక్ష, చైతన్యం నింపిందనీ, వందే మాతరం అనే నినాదం తో ఎంతో మంది వీరులు తెల్ల దొరలకు వ్యతిరేకంగా పోరాడి, ఉరి కొయ్యలను సైతం నవ్వుతూ ముద్దాడారనీ, అంతటి ఘన చరిత ఈ వందేమాతర గీతానికి ఉందన్నారు.
నేటి తరానికి వందే మాతరం స్పూర్తి అందజేయాల్సిన బాధ్యత అందరి పై ఉందనీ, ఈ సామూహిక గీతాలాపన అందరిలో దేశభక్తి, ఐక్యత భావాన్ని నింపుతుందని ఆశిస్తున్నాననీ ఆమె అన్నారు. వందే మాతరం గీతం పాడని, ఒక వర్గానికి వంతపాడే కరుడుగట్టిన మనసులు కరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ మంజుల, రఘురామయ్య, తిరుపతి రెడ్డి, లక్ష్మీ శ్యామ్ సుందర్, జి ఆర్ రెడ్డి, సత్య రఘుపాల్, ఉమేష్, పోషల్ వినోద్, విశ్వ హిందూ పరిషత్ ముఖ్యులు, జిల్లా బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

