కలం, మెదక్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki venkataiah) జిల్లా యంత్రాంగానికి సూచించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి పోలీసు, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శాఖల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని , అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసుల పరిష్కారంపై కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అట్రాసిటీ కేసుల దర్యాప్తు, విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఛైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లించరాదని ఛైర్మన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలులో అధికారులు జాప్యం లేదా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు.

