ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి సంరక్షణకు కలెక్టర్ కీలక సూచనలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సూచించారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏర్పడే వర్షాభావం, నీటి కొరతను ముందుగానే అంచనా వేసి ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించాలని, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

వి.బి.జి. రామ్‌జీ పనుల కింద గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల రూపకల్పనపై బాలానగర్, హన్వాడ, గండీడ్, మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్, మిడ్జిల్, నవాబ్‌పేట్ మండలాల సర్పంచులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 1 నుంచి 2027 జూన్‌ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అక్టోబర్‌ 2న నిర్వహించే గ్రామసభల్లో ప్రణాళికలను ప్రజల ముందుంచి ఆమోదం పొందిన అనంతరం పనులను అమలు చేయాలని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావంతో నీటి భద్రతకు ప్రాధాన్యం

వర్షపాతం అస్థిరత, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలపై పడే ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌ పాండ్లు, పర్కొలేషన్‌ ట్యాంకులు, రీచార్జ్‌ నిర్మాణాలు, రీచార్జ్‌ బోర్‌వెల్లు, సోక్‌పిట్లు వంటి పనులను అవసరమైన ప్రాంతాల్లో చేపట్టాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్‌, వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యం పెంపు, పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలను ప్రణాళికల్లో భాగం చేయాలని సూచించారు.

వి.బి.జి. రామ్‌జీ ప్రణాళికల్లో నీటి సంరక్షణ, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి అభివృద్ధి, వర్షాభావ పరిస్థితుల నివారణ అనే నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ తెలిపారు. పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు, అంగన్‌వాడీ భవనాలు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి మౌలిక అవసరాలను గుర్తించి ప్రణాళికలో చేర్చాలని సూచించారు. ఫామ్‌ పాండ్లను కేవలం నీటి నిల్వకు మాత్రమే కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేపల పెంపకం, పశుపోషణ వంటి జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.

వ్యవసాయంలో పంటల వైవిధ్యీకరణ, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పశుపోషణకు అవసరమైన షెడ్లు, పశుగ్రాసం పెంపకం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టే విధానాలపై సర్పంచులు, పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించడమే శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్‌పీ సీఈఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్‌ రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఫ్‌ఏలు, టీఏలు, వి.బి.జి. రామ్‌జీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>