కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో (KRK Colony) డబుల్ బెడ్రూం ఇళ్లలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లలో శానిటేషన్, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.
పెండింగ్ పనులను గుర్తించి వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాలనీలో మౌలిక వసతుల పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టి, పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

