కలం, వెబ్ డెస్క్ : దేశంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే రద్దు చేయాలని ప్రముఖ సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ (Prakash Raj) డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య పౌరులు తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కులను హరించడమేనని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు ప్రజా సంఘాలతో కలిసి కర్ణాటకలోని గుల్బార్గాలో ప్రజాసంఘాలతో కలిసి నిర్వహించిన ‘SIR ప్రతిరోధ్ యాత్ర’ (SIR నిరోధక పర్యటన) లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ తాజా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో సవరణల పేరుతో లక్షలాది మందిని ‘అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్’ (ASDDO) కేటగిరీలోకి మార్చి, అసలైన పౌరులను ఓటింగ్ వ్యవస్థకు దూరం చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఈ క్రమంలోనే తాను పుట్టి పెరిగిన బెంగళూరు నియోజకవర్గంలోనే తన పేరును కూడా ఈ జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదివరకు దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పౌరులను మళ్లీ కొత్త ఓటరుగా ఫారమ్-6 దాఖలు చేయమనడం ముమ్మాటికీ సామాన్యులను వేధించడమేనని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. పేదలు, వలస కార్మికులు, గిరిజనులు తమ నివాస ధ్రువీకరణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం ఎంతో కష్టతరమైన విషయమని పేర్కొన్నారు. ఈ ఎస్ఐఆర్ రద్దుకు సంబంధించి ప్రజా క్షేత్రంలో సేకరించిన వినతులు, నివేదికలను ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కును పునరుద్ధరించేంత వరకు మరియు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ప్రజాసంఘాలతో కలిసి తమ పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.

