కలం, నిజామాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటనతో నిజామాబాద్ (Nizamabad) ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలను సమీక్షించేందుకు గురువారం కమాండ్ కంట్రోల్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు, వైద్యులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో చిన్నారుల భద్రత , అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు , అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ప్రత్యేకంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో అగ్నిమాపక పరికరాల అందుబాటు, వాటి పనితీరు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు , ఫైర్ అలారం వ్యవస్థ , విద్యుత్ భద్రత , సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై అవగాహన , అత్యవసర సమయంలో రోగులను సురక్షితంగా తరలించే విధానం తదితర అంశాలను పరిశీలించారు.
చిన్నారులు చికిత్స పొందుతున్న ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆసుపత్రుల యాజమాన్యాలు ముందస్తు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, ఫైర్ సర్వీసెస్, వైద్య సిబ్బంది సమన్వయంతో వేగంగా స్పందించే విధంగా అవసరమైన ఏర్పాట్లు, మాక్ డ్రిల్ నిర్వహించాలి అని సూచించారు. ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లోపాలు గుర్తించినట్లయితే వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్ శుభం ప్రకాష్, డిఎంహెచ్ఓ రాజశ్రీ, జిల్లా ఫైర్ అధికారి పరమేశ్వర్, ఎన్ఎస్సి ప్రెసిడెంట్ డాక్టర్ కవిత రెడ్డి , డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ రాజేశ్వర్ రావ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, ఎస్పీలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, జిల్లాలోని చిన్నపిల్లల డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

