కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పుల్కల్ (Pulkal) మండలం పెద్దరెడ్డిపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా నివాసముంటున్న కొత్తగాడి పోచమ్మ (75) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య (Woman Murder) చేశారు.
పోచమ్మ నివసిస్తున్న ఇంటికి వచ్చిన దుండగులు, ఆమె గొంతు కోసి హతమార్చారు. అనంతరం వృద్ధురాలి మెడలోని బంగారు గుండ్లు, చెవులకు ఉన్న కమ్మలు, కాళ్ల పట్టగొలుసులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పుల్కల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో జరిగిన ఈ దారుణంతో పెద్దరెడ్డిపేటలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

