జూరాల నీటి పోరాటం.. కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

కలం, తెలంగాణ బ్యూరో: పదేండ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ లీడర్లు భారీ ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా వివరాలను వెల్లడించడంతో గులాబీ శ్రేణుల్లో అలజడి నెలకొన్నది. డీమోరల్ అయిన కేడర్‌లో ఉత్సాహం నింపాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల కొందరు సీనియర్ లీడర్లతో సమావేశమైన సందర్భంగా ఇకపై ‘జనంలోకి కేసీఆర్’ అనే నినాదాన్ని తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రస్తుతం జూరాల నీటి విడుదల విషయంలో రైతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కృష్ణా జలాల అంశంతో జనంలోకి వెళ్లాలనే అభిప్రాయాన్ని నేతల దగ్గర కేసీఆర్ వ్యక్తం చేశారు.

కేవలం కేడర్‌లో జోష్ నింపడానికి ఇలా లీకులు ఇస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ మెడ మీద కత్తిలా వేలాడుతున్న భూకబ్జా అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇదొక వ్యూహమా? రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా?.. ఇలాంటి సందేహాలు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే నెలకొన్నాయి. గతేడాది డిసెంబర్‌‌లో ఇదే తరహాలో హామీ ఇచ్చినా.. ఒక్కసారి కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్ వీడి బయటకు రాలేదు. దీంతో ఇప్పుడు ఇస్తున్న లీకులపైనా శ్రేణులకు నమ్మకం కుదరడం లేదు.

నీళ్ల అంశంతో జనంలోకి..

జూరాల అంశంలో బీఆర్ఎస్ కొట్లాడడంతోనే ప్రభుత్వం దిగి వచ్చిందని, కర్నాటకతో సంప్రదింపులు జరిపిందంటూ కేటీఆర్ క్రెడిట్‌ క్లెయిమ్ చేసుకుంటున్నారు. రాజకీయ గురువు చంద్రబాబు నాయుడుకు మేలు చేయడానికి తెలంగాణ నీటి హక్కుల్ని తాకట్టు పెడుతున్నారంటూ హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ మూకుమ్మడి దాడి చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారనే మెసేజ్‌తో పార్టీ బలోపేతం అవుతుందని, కేడర్ కూడా ఉత్సాహంగా పని చేస్తారని గులాబీ లీడర్లు భావిస్తున్నారు.

సాగునీటి అంశంలో మొదటి నుంచీ కేసీఆర్, హరీశ్‌రావు విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆ అంశంతోనే జనంలోకి వెళ్లాలన్నది గులాబీ అధినేత ఆలోచన. “రాష్ట్ర హక్కులను, ప్రజల ప్రయోజనాలను, నీటిని రక్షించుకోవాలి. కాంగ్రెస్ హయాంలో నా కండ్ల ముందు దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటాను? ఎందుకోసం ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తామంటే ఊరుకోం. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతాం.. భయపడం…” అంటూ గతంలోనే కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

10 నెలలుగా సైలెంట్..

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతూ ఉంటే మౌనంగా ఉండనంటూ గతేడాది డిసెంబర్ 21న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫామ్‌హౌస్ వీడి బయటకు రాలేదు. మూడు నాలుగు రోజుల్లోనే బహిరంగ సభలకు ఏర్పాట్లు మొదలవుతాయంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పి 10 నెలలవుతున్నా ఆ ఊసే లేకపోవడంతో ఇప్పుడు ఇస్తున్న లీకులపైనా కేడర్‌కు నమ్మకం లేదు.

భూకబ్జా ఆరోపణలతో రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల హడావిడి మొదలుకావడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల అంశాన్ని తీసుకొని రోడ్డెక్కుతున్నారా? భూకబ్జా ఇష్యూ నుంచి బయటపడడానికే నీళ్ల అంశాన్ని ఎత్తుకున్నారా? అన్న చర్చ జరుగుతున్నది.

2025లో కేసీఆర్ ఏమన్నారంటే?

“రెండేండ్ల నుంచి నేను మౌనం పాటిస్తున్నా. ఇప్పుడు ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ప్రాజెక్టులపై ఇటు రాష్ట్రాన్ని, అటు కేంద్రాన్ని ఎండగడతాం. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో బహిరంగ సభలు పెడతాం. గ్రామగ్రామాన ఉద్యమాన్ని చేపడతాం. ఇయ్టాల్టి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క. తోలు తీస్తాం. నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమవుతాను. గ్రామగ్రామాన డప్పు కొడతాం. కవులు, కళాకారులను తట్టి లేపుతాం” -2025 డిసెంబర్ 21న కేసీఆర్ వ్యాఖ్యలు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>