కలం, తెలంగాణ బ్యూరో/ క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ లో శుక్రవారం జరగనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Immersion)కు పోలీసు శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. దాదాపు 20 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లలో నాలుగు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కంపెనీలను, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రెండు సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించినట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి 8,142 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 42 ప్లాటూన్లను హైదరాబాద్కు రప్పించి ఏడు జోన్లకు కేటాయించినట్లు వెల్లడించారు. మొజంజాహి మార్కెట్, బషీర్బాగ్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఐజీ, డీఐజీ ర్యాంకు అధికారులను నియమించినట్లు తెలిపారు.
డ్రోన్లతో నిఘా.. డీజేలపై నిషేధం
ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లోని 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేశారు. కీలక ప్రాంతాల్లో 24 అత్యాధునిక డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 100 హైరైజ్ కెమెరాలతో విగ్రహాల లెక్కింపును చేపట్టనున్నారు. ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు 26 షీ-టీమ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఆపదలో ఉన్న మహిళలు డయల్ 112 లేదా షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే పరికరాలను సీజ్ చేయడంతో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
గజ ఈతగాళ్లు, మెకానిక్..
ప్రధాన జలాశయాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్మీ, పర్యాటక శాఖలకు చెందిన నిపుణులైన గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయాలు కలగకుండా మొబైల్, స్టాటిక్ జనరేటర్లను, రాత్రి వేళల్లో నిఘా కోసం వాచ్టవర్లను ఏర్పాటు చేశారు. వైద్య సేవల కోసం పారామెడికల్ సిబ్బందితో కూడిన అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచారు. వాహనాలు మొరాయిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రధాన కూడళ్ల వద్ద మెకానిక్లు, అదనపు డ్రైవర్లను అందుబాటులో ఉంచారు.
మహాగణపతి దర్శనాలు క్లోజ్
ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనాలను ఉత్సవ కమిటీ బుధవారంతోనే ముగించింది. ఇప్పటివరకు 25 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం నిమజ్జనం నేపథ్యంలో క్రేన్ వెల్డింగ్ పనులు, భక్తుల రద్దీతో ఏర్పాట్లకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలను ముందే క్లోజ్ చేసింది. నిమజ్జనానికి బుధవారం మధ్యాహ్నం నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు.
విగ్రహం చుట్టూ ఉన్న ఫ్లెక్సీలు, కర్రలు, బారికేడ్లను తొలగిస్తున్నారు. భారీ క్రేన్, టస్కర్ వాహనం సమీపానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం క్రేన్ సాయంతో మహాగణపతిని టస్కర్ వాహనంపైకి ఎక్కించి వెల్డింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఈ పనులు జరుగుతున్న సమయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తే రద్దీతో పాటు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత గంగమ్మ ఒడికి గణపయ్య బయలుదేరనున్నాడు. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా మధ్యాహ్నం నెక్లెస్ రోడ్డుకు శోభాయాత్ర చేరుకోనుంది. దారి పొడవునా పోలీసుల బందోబస్తు కొనసాగనుంది. రోప్ పార్టీ, గుర్రపు దళాలు, సాయుధ బలగాలు, మఫ్టీ పోలీసులు, షీ టీమ్లు బందోబస్తులో పాల్గొననున్నారు.

