కలం, వరంగల్: వరంగల్–హనుమకొండ నగరాల్లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో జోరువాన కురిసింది. ఓవైపు వర్షం దంచికొడుతుండగా.. మరోవైపు తొమ్మిది రోజులుగా పూజలందుకున్న గణనాథులను నిమజ్జనానికి (Ganesh Immersion) తరలించే ఊరేగింపులు కొనసాగాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో గణనాథుల వాహనాలు వరుసకట్టాయి. వర్షంలో తడుస్తూనే యువకులు డప్పుల మోతకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నారులు, మహిళలు సైతం వర్షాన్ని లెక్కచేయకుండా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. పలుచోట్ల వర్షపు నీటిలోనే గణనాథుల ఊరేగింపులు సాగాయి.
వరంగల్ నగరంలోని ప్రధాన కూడళ్లు, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో నిమజ్జన వాహనాలతో సందడి నెలకొంది. వర్షం కారణంగా రహదారులపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. వర్షంలోనూ భక్తుల ఉత్సాహం తగ్గకపోవడంతో నగరంలో గణనాథుల నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట చెరువు నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సందర్శించారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిమజ్జన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలివచ్చే ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

