కలం, ఖమ్మం బ్యూరో : పారే నది పక్కనే ఉన్నా ఏళ్ల తరబడి చుక్క నీటికి ముఖం వాచిన మన్యం నేలపై చివరకు ఆశల విత్తనం మొలకెత్తింది. నీళ్లు లేక ఎండమావులను తలపించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్షాధార భూములను తడిపేందుకు గోదావరి జలాలు ఏకంగా 39 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలోనే అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచే మారేళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (Marellapadu Lift Irrigation Scheme) రికార్డు స్థాయిలో పూర్తయి బుధవారం నాడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు స్విచ్ ఆన్ చేసి పంపులను ప్రారంభించగానే, గోదావరి జలాలు ఉరకలెత్తుతూ తుమ్మల చెరువులోకి ప్రవేశించాయి. దీంతో మణుగూరు, అశ్వాపురం ప్రాంతాల్లో దశాబ్దాలుగా నానబెట్టిన సాగునీటి కల చివరకు నెరవేరింది.
ఈ ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం ఒక ఇంజినీరింగ్ అద్భుతమనే చెప్పాలి. దిగువన పారే గోదావరి నీటిని ఎత్తైన భూములకు మళ్లించేందుకు రూ. 180.47 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణాన్ని చేపట్టగా, అందులో భాగమైన పంప్‌హౌస్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 25 కోట్లతో అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించింది. ఇందులో అమర్చిన 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు భారీ మోటార్లు నది మట్టం నుంచి 39 మీటర్ల ఎత్తు వరకు నీటిని తోడి, సెకనుకు 180 క్యూసెక్కుల చొప్పున కొండ కింద ఉన్న డెలివరీ సిస్టర్న్‌లోకి పంపుతాయి. అక్కడి నుంచి కాలువల ద్వారా జలాలు నేరుగా రైతుల పొలాల్లోకి ప్రవహిస్తాయి.
ప్రాజెక్టు ఇంత వేగంగా సాకారం కావడం వెనుక పాలకుల పట్టుదల, అధికారుల సమన్వయం స్పష్టంగా కనిపిస్తాయి. జిల్లా మంత్రులు, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు నిధుల మంజూరు, సాంకేతిక అనుమతులు, పనుల నాణ్యతపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ మార్గదర్శనం చేశారు. మంత్రుల ప్రోత్సాహంతో స్థానిక పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏకంగా 20 రోజుల పాటు ప్రాజెక్టు క్షేత్రస్థాయిలోనే తిష్ఠ వేసి, రాత్రింబవళ్లు పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఎదురైన సాంకేతిక చిక్కులను వెంటవెంటే పరిష్కరించడంతో రికార్డు సమయంలో ట్రయల్ రన్ విజయవంతమై, గోదావరి జలాలు కాలువల్లోకి పారాయి.
ప్రస్తుతం ప్రధాన కాలువల నిర్మాణం టెండర్ల దశలో ఉన్నప్పటికీ, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం తొలిదశ ప్రణాళికను తక్షణమే అమలులోకి తెచ్చింది. ముందుగా లిఫ్ట్ ద్వారా నీటిని తుమ్మల చెరువుకు తరలించి, దాని కింద ఉన్న 5,000 ఎకరాల స్థిరీకృత ఆయకట్టుతో పాటు మరో 2,000 ఎకరాలకు, అంటే మొత్తంగా 7,000 ఎకరాలకు తక్షణమే నీరందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలువల నిర్మాణమంతా పూర్తయితే, 9.65 కిలోమీటర్ల కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాల నూతన ఆయకట్టుకు, ఎడమ కాలువ ద్వారా 4,266 ఎకరాల పాత ఆయకట్టుకు నీరందుతుంది. తద్వారా అశ్వాపురం, మణుగూరు మండలాల్లోని 24 గ్రామపంచాయతీల పరిధిలోని 68 పల్లెలకు మహర్దశ పట్టి, దశలవారీగా 22 వేల నుంచి 23 వేల ఎకరాల వరకు సాగునీటి పరిధి విస్తరించనుంది.
మారేళ్లపాడు పథకంతో గోదావరి నీళ్లు తమ చెరువులు, కాలువల్లోకి చేరడంతో అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. నీరు లేక బీడుగా మారిన వేలాది ఎకరాల భూములు ఇకపై పచ్చని పంట పొలాలుగా మారబోతున్నాయి. చెరువులు జలకళ సంతరించుకోవడంతో భూగర్భ జలాలు పెరిగి, తమ దశాబ్దాల కష్టాలు తీరబోతున్నాయని గిరిజన, గిరిజనేతర రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాల సంకల్పం, ఇంజినీరింగ్ నైపుణ్యం తోడవడంతో మన్యం నేలకు నిజమైన ‘జల’ కిరీటం దక్కింది.

