కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ హాజరయ్యారు.
ఇదే సమావేశంలో సింగరేణి కాలరీస్ సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ ఎస్. హరీష్, డిస్కమ్‌ల సీఎండీలు ముషారఫ్ అలీ, జితేష్ వి. పాటిల్, వరుణ్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొని విద్యుత్ సంస్థల పని తీరుపై చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం స్థితి, అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆరా తీశారు.
యాదాద్రి థర్మల్ కేంద్రంలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తికి జీ 9 బొగ్గు అవసరమని అధికారులు వెల్లడించారు. సింగరేణిలో జీ 9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ 9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని తెలిపారు. జీ 9 బొగ్గు లభ్యత లేనప్పుడు ఆ సాంకేతికతతో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎలా నిర్మించారని సీఎం ప్రశ్నించారు.
పిట్ హెడ్ (బొగ్గు గనుల పైనే విద్యుత్ కేంద్ర నిర్మాణం) కాకుండా, దూరంగా ఎందుకు యాదాద్రి థర్మల్ కేంద్రం నిర్మించారని, దానికి బొగ్గు సరఫరాతో రాష్ట్రంపై పడే అదనపు భారం ఎంత అని అధికారులను ప్రశ్నించారు. నాడు రాజకీయ కారణాలతోనే పిట్ హెడ్‌పై కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించారని అధికారులు తెలిపారు. యాదాద్రికి బొగ్గు సరఫరాతో తెలంగాణ రాష్ట్రంపై రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని వివరించారు.
సింగరేణి నుంచి జీ 9 బొగ్గుకు ఉన్న అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడంతో జీ 9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేదని అధికారులు తేల్చి చెప్పారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా మహానది కోల్ ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని భట్టి విక్రమార్కకు సూచించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలని ఆదేశించారు.
Also Read : మినీ ఖైరతాబాద్ గణపతి లడ్డూకు భారీ ధర
Follow Us On : WhatsApp

