కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేస్తున్న అష్లే నాఫ్కే (Ashley Noffke) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నెదర్లాండ్స్ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాఫ్కేతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన 49 ఏళ్ల నాఫ్కే గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో కోచ్‌గా సేవలందించారు.
2025 నుంచి పాకిస్థాన్ జట్టు సహాయ కోచ్‌గా, హెడ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆటగాడిగా ఆస్ట్రేలియా తరఫున పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడటంతో పాటు బెంగళూరు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కుటుంబంతో సమయం గడపడానికి పక్కకు తప్పుకున్న రయాన్ కుక్ స్థానంలో నాఫ్కే ఈ బాధ్యతలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్‌తో పాటు 2028 టి20 ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టును అర్హత సాధించేలా చేయడం నాఫ్కే ముందున్న ప్రధాన లక్ష్యం.
జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, వ్యూహాల కంటే ముందు ఆటగాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడమే తన మొదటి ప్రాధాన్యమని నాఫ్కే పేర్కొన్నారు. నెదర్లాండ్స్ గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో అర్హత సాధించినప్పటికీ, 2011 తర్వాత ఒకే ఒక్క 50 ఓవర్ల ప్రపంచకప్‌కు అర్హత పొందింది.

