కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: యువత, విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సతీమణి యెన్నం లక్ష్మీ ప్రసన్న పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’(Mahabubnagar First) శిక్షణ కేంద్రంలో ప్రతిష్ఠించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ కేంద్రానికి చేరుకున్న లక్ష్మీ ప్రసన్నకు నిర్వాహకులు, అధ్యాపక బృందం, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిని దర్శించుకుని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య విశేష పుష్పార్చనలు, శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులతో మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని లక్ష్మీ ప్రసన్న ప్రారంభించారు. విద్యార్థినులు, శిక్షకులతో కలిసి కోలాటం ఆడి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత మట్టి వినాయక విగ్రహాన్ని విద్యార్థులు నృత్యాలు, బాజాభజంత్రీలు, మేళతాళాల నడుమ ఊరేగించారు. అనంతరం శిక్షణ కేంద్రం ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహించి వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ‘మహబూబ్‌నగర్ ఫస్ట్’ పర్యవేక్షకులు గుండా మనోహర్, సంస్థ ఇన్‌చార్జి నిజలింగప్ప, అనిల్, శిక్షకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

