కలం, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం (AP Govt) సోషల్ మీడియా వేదికగా సరికొత్త పాలసీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ(Social Media Influencer Policy)కి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇలాంటి విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన ప్రభుత్వం, ఇన్‌ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యంపై విధివిధానాలను రూపొందిస్తోంది.
ఈ పాలసీ(Social Media Influencer Policy)లో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా గుర్తించి ఫాలోవర్లు, వ్యూస్ సంఖ్య ఆధారంగా వారిని వివిధ కేటగిరీలుగా విభజించనున్నారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లకు నగదు ప్రోత్సాహకాలు, పారితోషికాలు చెల్లించనున్నారు. కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇస్తున్న అధిక పారితోషికాలను కూడా పరిశీలించిన ప్రభుత్వం, ఏపీలోనూ పారితోషికాల చెల్లింపుల ప్రక్రియపై ప్రత్యేకంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకోనుంది.
ఈ సందర్భంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను వారికి అందించే పారితోషికం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొదట కేటగిరీ ఏలో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్న వారిని చేర్చారు. వీరికి రూ.15 వేల వరకు పారితోషికం ఇవ్వనున్నారు. కేటగిరీ బీలో 50 వేల నుంచి 99,999 వరకు ఫాలోవర్లు ఉన్న వారిని చేర్చారు. వీరికి రూ.7,500 అందజేయనున్నారు. కేటగిరీ సీలో 25 వేల నుంచి 49,999 మంది ఫాలోవర్లు ఉన్న వారికి స్థానం కల్పించారు. వీరికి రూ.5 వేల పారితోషికం అందిస్తారు. చివరగా 10 వేల నుంచి 24,999 ఫాలోవర్లు ఉన్న వారికి రూ.2,500 పారితోషికం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నగదును నేరుగా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఖాతాల్లోనే జమ చేయనున్నారు.
Also Read : అతను ఎక్కడున్నాడో దేవుడికే తెలియాలి: జగన్
Follow Us On: X(Twitter)

