గణేషుడి​ శోభాయాత్రకు భారీ భద్రత.. 20 వేల మంది పోలీసుల మోహరింపు

కలం, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్‎లో జరిగే గణేష్ నిమజ్జన (Hyd Ganesh Immersion) శోభా యాత్రకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 20 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ తదితర విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 4 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) కంపెనీలను చార్మినార్‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ జోన్లలో, 2 సీఆర్‌పీఎఫ్ కంపెనీల‌ను ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌లలో మోహరించినట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుండి 8,142 మంది అధికారులు, సిబ్బందితో కూడిన 42 ప్లాటూన్లను హైదరాబాద్‎కి రప్పించి ఏడు జోన్లకు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రధాన ప్రాంతాలైన మొజంజాహి మార్కెట్, బషీర్ బాగ్, తదితర ప్రాంతాల్లో ఐజీ/డీఐజీ ర్యాంకు అధికారులను నియమించినట్లు సీపీ వెల్లడించారు.

10 వేల సీసీ కెమెరాలు.. 24 డ్రోన్లు

నిమజ్జనం వేళ శోభయాత్రను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఊరేగింపు సాగే ప్రధాన మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలోని కంట్రోల్ రూంకు అనుసంధించారు. కీలక ప్రాంతాల్లో 24 అత్యాధునిక డ్రోన్లతో నిఘా ఉంచనున్నారు. ప్రధాన మార్గాల్లో దాదాపు 100 వరకు హైరైజ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా విగ్రహాల లెక్కింపును చేస్తున్నారు.

శోభాయాత్ర (Hyd Ganesh Immersion) మార్గాల్లోని ఎత్తైన భవనాల పైకప్పులపై అత్యాధునిక బైనాక్యులర్లు, వైర్‌లెస్‌ సెట్లతో సిబ్బందిని మోహరించి ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. బంజారాహిల్స్‌లోని ప్రధాన జాయింట్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్‌, మొఘల్‌పురా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటైన ప్రత్యేక కంట్రోల్‌ రూముల్లో అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తారు.

ప్రధాన జలాశయాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్మీ, పర్యాటక శాఖలకు చెందిన నిపుణులైన గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. విద్యుత్‌ అంతరాయాలు కలగకుండా మొబైల్‌, స్టాటిక్‌ జనరేటర్లు, రాత్రి వేళల్లో నిఘా కోసం వాచ్‌ టవర్లు, వైద్య సేవల కోసం పారామెడికల్‌ సిబ్బందితో కూడిన అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలను సిద్ధం చేశారు. వాహనాలు మొరాయిస్తే ట్రాఫిక్‌ నిలిచిపోకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద మెకానిక్‌లు, అదనపు డ్రైవర్లను సైతం అందుబాటులో ఉంచారు.

మహిళల భద్రతకు 26 షీ-టీమ్ బృందాలు

శోభాయాత్ర వేళ పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళలు, యువతుల భద్రత కోసం 26 షీ- టీమ్ బృందాలను పోలీస్ శాఖ నియమించింది. నిమజ్జనం రోజున నేర నియంత్రణ కోసం సీసీఎస్‌ పరిధిలో 139 మంది సిబ్బందిని 5 సెక్టార్లుగా విభజించి, 25 ప్రత్యేక బృందాలుగా మఫ్టీలో నిఘా ఉంచనున్నారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే డయల్‌ 112 లేదా షీ-టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490616555 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఖైరతాబాద్‌, బాలాపూర్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించిన 1,172 మంది ఆకతాయిలను (1,121 మంది మేజర్లు, 51 మంది మైనర్లు) షీ- టీమ్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.

డీజే, బాణసంచా కాల్చడంపై నిషేధం

ప్రజారోగ్యం, శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్‌ మిక్సర్లు, అధిక శబ్ద తీవ్రత కలిగించే పరికరాలు, బాణసంచా కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీస్ పూర్తిగా నిషేధం విధించింది. ఈ అంశంపై ఇప్ప‌టికే జారీ చేసిన ఉత్తర్వులను అతిక్రమిస్తే పరికరాలను సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చరించారు.

హైదరాబాద్ విశిష్ట సంస్కృతి అయిన ‘గంగా-జమునా తెహజీబ్‌’ను, సోదరభావాన్ని కాపాడుకుంటూ పోలీసులకు సంపూర్ణంగా సహకరించి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా ముగించేందుకు హైదరాబాద్‌ సిటీ పోలీసు యంత్రాంగం తరఫున అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

నగర ప్రజలంతా సంయమనం పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సూచించారు. సోషల్‌ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, పుకార్లు సృష్టించినా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే కేటాయించిన జలాశయాల్లో నిమజ్జనాలు చేపట్టాలని అన్నారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా సిటీ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే అడ్వజైరీలను ఎప్పటికప్పుడు నగర ప్రజలు ఫాలో కావాలని, అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలను చేసుకోవాలని సూచించారు. వాహనాల డ్రైవర్ల విషయంలో నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుభవజ్ఞులైన వారిని నియమించుకోవాలని చెప్పారు. మండపం నుంచి నిమజ్జనం వరకు ముందుగానే రూట్ సర్వే చేయాలని, ఇబ్బందులు ఎక్కడున్నాయో ముందే గుర్తుంచుకుని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>