కరెంట్‌ పేరుతో కేసీఆర్ మార్క్ అవినీతి: ఎంపీ చామల

కలం, భువనగిరి: రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే భయాందోళనలు సృష్టించేందుకు బీఆర్ఎస్ (BRS) నేతలను ఆరు బృందాలుగా విభజించి పవర్ స్టేషన్ల వద్దకు పంపుతూ డ్రామాలు ఆడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. కేసీఆర్ విద్యుత్ ఛార్జీల కోసం పోరాటం చేశారని కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, ముందు ఆయన చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. ‘2000 సంవత్సరంలో చారిత్రాత్మక బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమ కాల్పులు జరిగినప్పుడు కేసీఆర్ టీడీపీలోనే ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారనే అసంతృప్తితోనే 2001లో టీడీపీ నుంచి బయటకు వచ్చారన్నది చేదు నిజం. నిజానికి రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత, దానిపై పూర్తి పేటెంట్ హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీదే” అని చామల స్పష్టం చేశారు. కేసీఆర్ ఇకనైనా పిట్ట కథలు చెప్పడం బంద్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిస్కంల‌పై రూ.81,000 కోట్ల అప్పుల భారం

కేసీఆర్ ప‌దేళ్ల పాలనలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని చామల ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన చేతకాని పరిపాలన వల్ల డిస్కంలపై ఏకంగా రూ.81,000 కోట్ల అప్పుల భారం పడిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అత్యంత తక్కువ ధరకు విద్యుత్ లభించే అవకాశాలున్నా.. కమీషన్ల కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేస్తూ కుమ్మక్కు ఒప్పందాలు చేసుకున్నారన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆధునిక ‘సూపర్ క్రిటికల్ టెక్నాలజీ’ని కాదని, పాత పద్ధతి అయిన ‘సబ్ క్రిటికల్ టెక్నాలజీ’ని వాడి నిబంధనలకు విరుద్ధంగా రూ. 1,000 కోట్ల ప్రజాధనాన్ని నష్టం చేశారని, యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఓపెన్ బిడ్డింగ్ పెట్టకుండా నామినేషన్ పద్ధతిలో బిహెచ్ఈఎల్‌కు కట్టబెట్టి భారీగా కమీషన్లు దండుకున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో ఏ ప్రాజెక్టు వద్ద ఎంత అవినీతికి పాల్పడ్డారో కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద పూర్తి లెక్కలు ఉన్నాయని, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి అన్ని ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎల్ నినో కరువుపై శవ రాజకీయాలు

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. దాంతో వచ్చిన కరువును కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఎంపీ చామల ధ్వజమెత్తారు. “రైతులకు మేలు జరగాలని కోరుకోవాల్సింది పోయి, విపత్తు వేళ రైతులను రెచ్చగొట్టి పంటలు వేయించి వారిని ఆగం చేయాలని భావిస్తున్నారు. తమకు ఓట్లు వేయలేదనే కక్షతోనే రైతులపై, ప్రజలపై బిఆర్ఎస్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది” అని దుయ్యబట్టారు. ఫామ్‌హౌస్ అక్రమాల బాగోతాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేటీఆర్ ఈ నాటకాలకు తెరలేపారని విమర్శించారు. రైతులు కేవలం వరిపైనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టేలా ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని, ప్రజలకు, రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్ అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 10 ఏళ్లలో అప్పులమయం చేసిన బీఆర్ఎస్ నేతల అక్రమాల ఫైళ్లను రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా బయటపెడతామని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>