కలం, ఖమ్మం బ్యూరో : ఒకే జిల్లా.. ఒకే నేపథ్యం.. ఒకే తరహా దారుణం. భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు (Bhadradri Agency Tragedy) కలచివేస్తున్నాయి. గతంలో శిరీష (Sirisha) హైదరాబాద్‌లో దారుణానికి బలైతే.. తాజాగా హరిణి ఇంటి పక్కనే హత్యకు (Harini Murder) గురయ్యారు. ఇద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి చాటు బిడ్డలుగా కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చారు.
మబ్బులు విప్పారక ముందే లేచి, ఒళ్లు దాచుకోకుండా రెక్కల కష్టం చేసే ఆ తల్లులకు జీవితం ఎప్పుడూ ఒక పరీక్షే. భర్త నీడ దూరమై, ఇంట్లో పూట గడవడమే గగనమైన వేళ… ఆ కష్టాల చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన వెలుగు కిరణాలు వాళ్ల కూతుళ్లు. “అమ్మా! నీ కష్టాలు తీరుస్తా.. నర్సింగ్ పూర్తి చేసి నిన్ను మహారాణిలా చూసుకుంటా” అని పట్టుదలతో అడుగులేసిన ఆ ఆడబిడ్డలు, ఆ పేద కుటుంబాలకు కొండంత ఆశగా కనిపించారు. కానీ, సమాజంలో కమ్ముకున్న క్రూరత్వం ఆ ఆశల దీపాలను ఆర్పేసింది. అసలు భద్రాద్రి ఏజెన్సీ ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ ఏది? ఈ నిరుపేద, తల్లి చాటు బిడ్డల దారుణ ముగింపునకు కారకులెవరు? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ తల్లి రాజేశ్వరికి మూడేళ్ల క్రితం భర్త చనిపోయినప్పుడు లోకమంతా శూన్యమైపోయింది. కానీ, తన ఇద్దరు కూతుళ్లను చూసుకుని గుండె నిబ్బరం తెచ్చుకుంది. కూలి పనులకు వెళ్తూ రూపాయి రూపాయి కూడబెట్టి, పెద్ద కూతురు హరిణిని ఖమ్మంలో బీఎస్సీ నర్సింగ్ ప్రథమ సంవత్సరంలో చేర్పించింది. సెలవులు కావడంతో రెండు రోజుల క్రితమే కళ్లెదుటికొచ్చిన బిడ్డను చూసి ఆ తల్లి మురిసిపోయింది. కానీ ఆ సంతోషం ముచ్చటగా మున్నాళ్లైనా నిలవలేదు.
మంగళవారం సాయంత్రం తల్లి పనిమీద బయటకు వెళ్లిన ఆ కాసేపట్లోనే, ఒంటరిగా ఉన్న 18 ఏళ్ల హరిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. తిరిగొచ్చిన తల్లికి కూతురు కనిపించక గుండెలు బాదుకుంటూ వెతికితే… ఇంటి వెనుక మరుగుదొడ్డి సందులో, మెడపై నులిమిన ఆనవాళ్లు, ముక్కు, నుదుటిపై రక్తపు గాయాలతో విగతజీవిగా పడి ఉంది. “నా బిడ్డను పక్కింటి వాళ్లే పొట్టన పెట్టుకున్నారు” అంటూ ఆ తల్లి వేస్తున్న కేకలు వెంగన్నపాలెం గాలిలో ప్రతిధ్వనిస్తూ ఊరంతా శోక సంద్రంలో ముంచెత్తాయి.
అప్పుడు శిరీష.. ఇప్పుడు హరిణి
ఇది ఒక్క హరిణి కుటుంబపు కన్నీటి గాథ మాత్రమే కాదు. కొద్దిరోజుల క్రితమే ములకలపల్లి మండలానికి చెందిన నర్సు శిరీష కథ కూడా సరిగ్గా ఇలాగే అర్ధాంతరంగా ముగిసిపోయింది. శిరీష ఇంట్లో కూడా తండ్రి లేడు. తల్లి కూలి పని చేసి పెంచితే, ఏడు నెలల క్రితమే హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలోని ఒక హాస్పిటల్‌లో నర్సుగా చేరింది. ఆగస్టు 28వ తేదీ రాత్రి 10:30 గంటలకు కూడా తల్లితో వీడియో కాల్ మాట్లాడి “అమ్మా నేను జాగ్రత్తగా ఉన్నా” అని చెప్పిన ఆ బిడ్డ, తెల్లారే సరికి శవమై తేలింది. రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో కిటికీ గుండా గదిలోకి చొరబడిన సనావుల్లా ఖాన్ అనే కామాంధుడి లైంగిక దాడిని తీవ్రంగా ప్రతిఘటించినందుకు.. ఇనుప రాడ్డుతో ముఖంపై బాది, గొంతు నులిమి చంపేశాడు.
ఈ రెండు దారుణాలను నిశితంగా పరిశీలిస్తే…. ఇద్దరు యువతులదీ తండ్రి లేని నిరుపేద కుటుంబాలే. తల్లుల కష్టాన్ని తీర్చి, సమాజంలో స్వయంసమృద్ధి సాధించాలనే బలమైన ఆకాంక్షతో నర్సింగ్ రంగాన్ని ఎంచుకున్న పట్టుదల ఉన్న విద్యార్థినులే. అయితే, సమాజంలో రక్షణ లేని, తండ్రి లేని నిరుపేద ఆడపిల్లలను నేరస్థులు ఎంత తేలికగా ‘ఈజీ టార్గెట్’ చేసుకుంటున్నారో ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. బాధితులు ఒంటరిగా ఉన్న క్షణాలను పక్కాగా గమనించి, పథకం ప్రకారం వారి ప్రాణాలు తీసేంతగా క్రూరులు తెగబడుతున్నారు.
శిరీష దారుణ హత్య తర్వాత నిఘా పెంచామని, మహిళలపై అఘాయత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు యంత్రాంగం ప్రకటించినా, కేవలం మూడు వారాల వ్యవధిలోనే హరిణి సొంత ఇంటి ఆవరణలోనే దారుణంగా ప్రాణాలు కోల్పోవడం మహిళల భద్రతా, వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా ఎత్తిచూపుతోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి, షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ సమాజానికి సేవ చేసే ఆడబిడ్డలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ సమాజంపై, ప్రభుత్వంపై ఉంది.
హరిణి మృతిపై ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శక విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఏజెన్సీ(Bhadradri Agency Tragedy)లోని నిరుపేద విద్యార్థినులకు ప్రత్యేక భద్రత కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కన్నీళ్లు ఇంకిపోయిన ఆ తల్లుల కడుపు కోతకు సమాధానం చెప్పేదెవరు? ఆశల పందిరి కూలిపోయిన ఆ పేద కుటుంబాలకు న్యాయం జరిగేదెప్పుడు? చట్టం త్వరితగతిన స్పందించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తేనే, ఈ ఏజెన్సీ ఆడబిడ్డల ఆత్మలకు శాంతి చేకూరుతుంది.
Also Read : తెలంగాణ ఈగల్ ఫోర్స్ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

