మారేళ్లపాడు ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రులు తుమ్మల, పొంగులేటి!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారేళ్లపాడు (Marellapadu project) వద్ద రూ.610 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రారంభించారు. పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను తుమ్మల చెరువుకు విడుదల చేసి పథకాన్ని జాతికి అంకితం చేశారు.

దీంతో ఈ ప్రాంత రైతుల దశాబ్దాల కరువు తీరి పొలాల్లో గోదావరి జలాలు పరుగులు తీశాయి. తొలి విడతలో 4,300 ఎకరాలకు, దశలవారీగా 23 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందనుంది.

​అనంతరం గొందిగూడెంలో జరిగిన సభలో మంత్రి తుమ్మల (Thummala Nageswara Rao)మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 నియోజకవర్గాలకు సాగునీరు విస్తరిస్తున్నామని, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. భద్రాచలం రామాలయాన్ని రూ.350 కోట్లతో దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దుతామన్నారు.

మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. రైతులు, పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పులుసుబొంత ప్రాజెక్టు పనులను, కొత్త రిజర్వాయర్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. గోదావరి రాకతో 24 గ్రామాల రైతుల కల నెరవేరిందన్నారు.

కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. జిల్లాలో మరో 16 వేల ఎకరాలకు సాగునీరందించేలా సీతారామ కాలువల పనులు, భూసేకరణ వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>