కలం, ఆదిలాబాద్: పదేళ్లుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామస్థుల (Narsapur Villagers) నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Collector Rajarshi Shah) చొరవతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసమస్య పరిష్కారం కావడంతో బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అర్హులైన గ్రామస్థులకు పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా భూమిపై హక్కు పత్రాల కోసం అధికారుల చుట్టూ తిరిగిన గ్రామస్థులకు పట్టాలు అందడంతో ఆనందం వ్యక్తమైంది.
తమ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపిన కలెక్టర్ రాజర్షిషాను గ్రామస్థులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడి సాగిన నిరీక్షణకు ముగింపు పలికి తమ భూమిపై హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, తహశీల్దార్ కోట్నాక రఘునాథరావు, నర్సాపూర్ సర్పంచ్ గెడం జగదిరావు, పట్టాదారులు పాల్గొన్నారు.

