కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కష్టకాలంలో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్(Mahabubnagar) ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) నిధులతో ఏర్పాటైన పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నలుగురు జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు సంఘం ప్రతినిధులు చెక్కులను అందజేశారు. జర్నలిస్టు అనిల్ భార్య గుండెపోటుకు గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రెండు స్టెంట్లు వేయడంతో వైద్య ఖర్చులకు భరోసాగా ఉండేందుకు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సబ్‌ఎడిటర్ ప్రదీప్ కుమార్‌కు సైతం సంఘం తరఫున ఆర్థిక సాయం అందించారు. అలాగే గతంలో అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందిన జర్నలిస్టులు రవికుమార్, మధుసూదన్ రెడ్డికి కూడా ఆర్థిక సహాయం అందించారు.
జర్నలిస్టులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి, వారి కుటుంబానికి అండగా నిలవడమే సంక్షేమ సంఘం ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. ప్రమాదం, అనారోగ్యం వంటి క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టులు ఒంటరిగా లేరనే భరోసా కల్పించేందుకు సమిష్టిగా ముందుకు వస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ముందుంటుందని తెలిపారు. ప్రతి జర్నలిస్టు సంఘంలో సభ్యత్వం పొందాలని వారు కోరారు. సభ్యత్వం ఉన్నవారికే సంఘం నుంచి సహాయం అందుతుందని తెలిపారు.
ప్రస్తుతం రెండు, మూడు రోజులుగా ఉచిత సభ్యత్వాలు అందిస్తున్నామని, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సంఘం సభ్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని జర్నలిస్టులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ జిల్లెల్ల రఘు, ఉపాధ్యక్షుడు పల్లెమోని యాదయ్య, సభ్యులు సతీష్ కుమార్ రెడ్డి, భాస్కరాచారి, సబ్‌ఎడిటర్లు సాయి, చక్రవర్తి, రవి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

