పాలమూరు యూనివర్సిటీ వివాదంపై AISF ఫైర్.. విద్యార్థుల ఐక్యతకు పిలుపు!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) లో వినాయక శోభాయాత్ర సందర్భంగా విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం, అనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు తీవ్రంగా ఖండించారు.

బుధవారం ఆయన ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల కోసం పోరాడాల్సిన విద్యార్థి సంఘాలు, విద్యార్థుల మధ్యే విభేదాలు, వాగ్వాదాలు సృష్టించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణం విద్యార్థుల విద్యాభ్యాసానికి, హక్కుల కోసం పోరాటానికి వేదిక కావాలి తప్ప, పరస్పర ఘర్షణలకు వేదికగా మారకూడదన్నారు.

విద్యార్థి సంఘాల మధ్య గొడవలు పెట్టి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు యూనివర్సిటీలో స్థానం లేదని రాజు హెచ్చరించారు. కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే విషయంలో యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టమైన నిబంధనలు పాటించాలని, అన్ని విద్యార్థి సంఘాలకు సమానంగా సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. అనుమతించిన సమయాన్ని, నిబంధనలను ఉల్లంఘించినా లేదా వాటిని అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినా, దాని ప్రభావం చివరికి విద్యార్థులపైనే పడుతుందని అన్నారు.

యూనివర్సిటీలో ప్రభుత్వ జీతం తీసుకుని ఏకపక్షంగా వ్యవహరించే ప్రొఫెసర్ల పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని సి.రాజు తెలిపారు. విద్యార్థుల ఐక్యతను కాపాడటం ప్రతి విద్యార్థి సంఘం బాధ్యత అన్నారు. వ్యక్తిగత ఆధిపత్యాలు, పరస్పర ఆరోపణలు, ఘర్షణలను పక్కనపెట్టి విద్యార్థుల సమస్యలపై పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు. యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే, విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ మరింత బలమైన ఉద్యమాన్ని చేపడుతుందని రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>