కలం, కరీంనగర్: గణనాథుని నిమజ్జనాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని మానేరు విద్యాసంస్థల (Maneru Educational Institutions) విద్యార్థులు బుధవారం వినూత్న రీతిలో ఆకట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులంతా (Maneru Students) కలిసి బాల గణేశుడి ఆకృతిలో నిలిచి భక్తి, ఉత్సాహాన్ని చాటుకున్నారు.
విద్యలో గుణవంతులుగా రాణించడంతో పాటు, గణనాథుడి ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు.
నవరాత్రుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మానేరు విద్యాసంస్థల్లో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఎంతో సృజనాత్మకంగా, అద్భుతంగా గణనాథుడి ఆకృతిని రూపొందించడం అభినందనీయమన్నారు.
ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో భక్తి, ఐక్యత, సృజనాత్మకత, సమష్టి భావనను పెంపొందిస్తాయని అనంతరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

