పెద్దపల్లి డీపీఓ ల్యాప్‌టాప్ వివాదంపై మౌనం ఎందుకు? ​

కలం, ​పెద్దపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో వాడే ప్రతి వస్తువూ ప్రజాధనంతో కొనుగోలు చేసినదే. కానీ అధికారులు పదవీ విరమణ పొందాక ప్రభుత్వ వస్తువులను తమ సొంత ఆస్తిలా తీసుకెళ్లడం, దాన్ని ‘కానుక’గా చెప్పుకోవడం ప్రభుత్వ నిబంధనలకు ఏమేరకు సమ్మతం? ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి (Peddapalli DPO) కార్యాలయంలో చోటుచేసుకున్న ల్యాప్‌టాప్ మాయం ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విధుల కోసమా? వ్యక్తిగత కానుకా?

2021లో తెలంగాణ ప్రభుత్వం జిల్లా పంచాయతీ కార్యాలయాలకు డిజిటలైజేషన్, అధికారిక విధులను వేగవంతం చేసేందుకు ల్యాప్‌టాప్‌లను కేటాయించింది. వీడియో కాన్ఫరెన్సులు, గ్రామపంచాయతీల ఆర్థిక లావాదేవీలు , ఆన్‌లైన్ నివేదికలు, సీఎఫ్ఎమ్‌ఎస్ మరియు రోజువారీ కార్యాలయ పర్యవేక్షణ కోసం ఈ సాధనం ఎంతో కీలకం. ​అయితే, ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ పొందిన మాజీ జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, ఆ ల్యాప్‌టాప్‌ను కార్యాలయానికి అప్పగించకుండా తన వెంట తీసుకెళ్లారని అధికారులు చెబుతున్నారు.

దానిని తిరిగి అప్పగించాలని కార్యాలయ సిబ్బంది కోరగా, “అది తనకు గిఫ్ట్‌గా వచ్చింది” అని ఆయన సమాధానమివ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక బాధ్యతల కోసం ఇచ్చిన డిజిటల్ పరికరం వ్యక్తిగత బహుమతిగా ఎలా మారుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

​పర్యవేక్షణ లోపమా? అధికారుల ఉదాసీనతనా?

ల్యాప్‌టాప్ లేకపోవడం వల్ల కార్యాలయ రోజువారీ డిజిటల్ విధులు, ఇ-మెయిల్ తనిఖీలు, ఈ-పంచాయతీ నివేదికల పంపకం మరియు జూమ్ సమావేశాలలో పాల్గొనడంలో తీవ్ర వ్యత్యాసం ఎదురవుతోంది. ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పరికరం తిరిగి రాకపోవడంపై జిల్లా కలెక్టర్ దృష్టికి నోట్ ఫైల్ పంపినప్పటికీ, బలమైన చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్నే చూపుతోంది. ​ఈ వ్యవహారంపై మరోసారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ల్యాప్‌టాప్‌ను రికవరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత జిల్లా అధికారులు చెబుతున్నారు.

ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి రిటైర్ అయ్యాక కూడా అధికారిక పరికరాన్ని ‘కానుక’ పేరుతో తన వద్ద ఉంచుకోవడం వల్ల మిగతా ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆస్తిని కార్యాలయానికి రికవరీ చేయడంతో పాటు, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>