ఎర్రవల్లి ల్యాండ్స్..కేసీఆర్‌కు బిగ్ షాక్!

కలం, తెలంగాణ బ్యూరో: ఎర్రవల్లి భూముల (Erravalli Lands) వ్యవహారంలో బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌ (KCR)కు త్వరలో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారా? ఆ నోటీసుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించనున్నారా?.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు కావడమే ఇందుకు కారణం. రెవెన్యూ అధికారులు ఇచ్చే నోటీసులపై కేసీఆర్ ఒకవేళ హైకోర్టును ఆశ్రయించినట్లయితే, తాత్కాలిక ఉపశమనం లభిస్తుందనే అనుమానంతో.. హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ పీఎన్ అరుణ్ కుమార్ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.

కేసీఆర్ పిటిషన్ దాఖలు చేస్తే, దానిపై విచారణ జరిపే సమయంలో తన వాదనను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన కేవియట్ దాఖలు చేశారు. ‘‘నేను తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఫిర్యాదు చేసినవారిలో నేనూ ఒకడిని. ప్రభుత్వ భూములకు కస్టోడియన్‌గా ఉండాల్సిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికార దుర్వినియోగానికి పాల్పడి వివిధ రూపాల్లో భూముల్ని కబ్జా చేశారు” అని పిటిషన్‌లో ఆరోపించారు. అందులో కేసీఆర్‌ను తొలి ప్రతివాదిగా పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్టు అర్నబ్ గోస్వామితో పాటు ఎన్డీటీవీ, ఏఎన్ఐ మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు.

ధరణి ద్వారా అక్రమాలు

సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పిటిషన్‌లో అరుణ్ కుమార్ ఆరోపించారు. ‘‘అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో కేసీఆర్ ఆయన భార్య పేరు మీద 60 ఎకరాల కంటే ఎక్కువ భూమి అక్రమంగా పోగేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డులను మానిప్యులేట్ చేసి, పొరుగున ఉన్న రైతుల భూములను కలుపుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కేసీఆర్ సహా ఆయన కుటుంబ సభ్యుల భూముల వివరాలను వెల్లడించారు. వీటిని పైన పేర్కొన్న మూడు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ప్రసారం చేయకుండా కేసీఆర్‌కు పరోక్షంగా ఉపయోగపడ్డాయి. అందుకే వారిని ప్రతివాదులుగా చేర్చాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.

అందుకే కేవియట్..

ఒకవేళ కేసీఆర్‌కు రెవెన్యూ అధికారులు నోటీసు జారీ చేసినట్లయితే, వాటికి వ్యతిరేకంగా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లయితే, విచారణ జరిపే అంశాన్ని ముందుగా తనకు తెలియజేయాలని పిటిషన్‌లో అరుణ్ కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎమ్మార్వో లేదా సంబంధిత ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్ జారీ చేసే నోటీసులపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేదా వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని గ్రహించినందునే కేవియట్ దాఖలు చేస్తున్నానని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>