కాల్వ నరసింహస్వామి ఆలయ భద్రతపై నిర్లక్ష్యం..!

కలం, దిలావర్‌పూర్ : ఆలయాల భద్రతకు సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్న వేళ.. దిలావర్‌పూర్ (Dilawarpur) మండలం కాల్వ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాత్రం కొద్దిరోజులుగా కెమెరాలు పనిచేయకపోవడం ఆందోళన కలిగించింది. ఇటీవల జిల్లాలోని పలు ఆలయాల్లో వరుస చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే సంబంధిత అధికారులు స్పందించాల్సిన పరిస్థితిలో ఓ దాత ముందుకొచ్చి సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించడం గమనార్హం.

ఆలయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని విషయం ఓ దాత దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. కెమెరాల మరమ్మతులకు అయ్యే ఖర్చుతో పాటు టీవీకి సంబంధించిన వ్యయాన్ని కూడా స్వయంగా భరించి వాటిని పునరుద్ధరించారు. దీంతో ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భక్తుల సహకారంతో ఆలయానికి సంబంధించిన సమస్య పరిష్కారం కావడం అభినందనీయమే అయినా.. దేవాదాయ శాఖ పనితీరుపై మాత్రం ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాలుగు నెలలుగా ఆలయ కమిటీ లేకుండానే..

ఆలయ కమిటీ పదవీకాలం ముగిసి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవడంతో ఆలయ పర్యవేక్షణపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దేవాదాయ శాఖ అధికారులు కూడా ఆలయ నిర్వహణ, భద్రత, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భక్తులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు దాత సహకారం తీసుకోవాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు.

ఇంచార్జితో నెట్టుకొచ్చి.. రెగ్యులర్ ఈవో వచ్చినా?

కొంతకాలంగా ఆలయ నిర్వహణ ఇంచార్జి ఈవోల పర్యవేక్షణలో కొనసాగింది. సుమారు నెల రోజుల క్రితం రెగ్యులర్ ఈవోను నియమించినప్పటికీ ఆలయంలో నెలకొన్న సమస్యలన్నీ పూర్తిస్థాయిలో పరిష్కారం కావాల్సి ఉందని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయంపై దృష్టి సారిస్తున్న అధికారులు ఆలయ భద్రత, పరిశుభ్రత, మౌలిక వసతులు, నిర్వహణపైనా అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>