కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం సంతరించుకుంది. ఒకవైపు సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుర్తింపు యూనియన్ ఎన్నికల సైరన్ మోగగా, మరోవైపు ఇండియన్ రెడ్‌క్రాస్ (Red Cross) సొసైటీ పాలకవర్గ ఎన్నికలు, సింగరేణి (Singareni) ఎన్నికలు సైతం నగారా మోగించడంతో ఉమ్మడి జిల్లా అంతటా సందడి మొదలైంది. ఉద్యోగులు, కార్మికులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారులు ఓటర్లుగా ఉన్న ఈ రెండు సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వివిధ వర్గాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.
ఆర్టీసీలో పదేళ్ల తర్వాత పోరు
ఆర్టీసీలో దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గుర్తింపు యూనియన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కార్మిక సంఘాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో మొత్తం 2,830 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,340 మంది డ్రైవర్లు, 955 మంది కండక్టర్లు, 376 మంది మెయింటెనెన్స్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఉన్నారు. 2016లో విజయం సాధించిన టీఎంయూ ఈసారి పోటీకి దూరంగా ఉంటూ ఇతర సంఘాలకు మద్దతు ఇచ్చే యోచనలో ఉంది. దీంతో ఇతర యూనియన్ల మధ్య పొత్తులు, కొత్త కూటముల ఏర్పాటు వేగవంతమైంది. అక్టోబర్ 9న రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.
రెడ్‌క్రాస్ సొసైటీలో పోలింగ్ నగారా
సామాజిక సేవా సంస్థ అయిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా శాఖ 15 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. కరీంనగర్ జిల్లాలోని 17 వేలకు పైగా అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు ఓటర్లుగా ఉన్నారు. నామినేషన్ రుసుము రూ.10,000 కాగా, ప్రతీ నామినేషన్‌ను ఇద్దరు సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నెల 24న నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. అక్టోబర్ 4న ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. కాగా, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. ఫలితంగానే పేదలకు మేలు జరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో డయాగ్నోస్టిక్ ధరల విషయంలో పేదలు భరించలేని పరిస్థితి నెలకొంది. అదే విధంగా జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేసి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. రక్తం విషయంలో బయట 1800 పైగా తీసుకుంటే రెడ్ క్రాస్ లో 1250 రూ. యూనిట్ కు తీసుకోవడం కొంత ఊరటనిస్తున్నా పేదల విషయంలో కనికరించాలని కోరుతున్నారు.
సింగరేణిలో ఎన్నికల కోలాహలం
సింగరేణి కోల్‌బెల్ట్ వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో, కోల్‌బెల్ట్‌లోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ వేగవంతం చేసింది. సింగరేణిలో 1990 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో మొదట్లో రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగేవి. 2003 నుంచి 2017 వరకు నాలుగేళ్ల కాలపరిమితి కొనసాగగా, 2017లో తిరిగి రెండేళ్లకు కుదించారు. ఈ క్రమంలో ఏఐటీయూసీ గడువు ముగుస్తుండటంతో గతంలో టీబీజీకేఎస్‌కు ఇచ్చినట్లే తమకు కూడా నాలుగేళ్ల అవకాశం ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేస్తున్నారు.
తరచూ ఎన్నికల వల్ల సంస్థపై అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్‌లు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని యాజమాన్యానికి, కేంద్ర కార్మిక శాఖకు వినతిపత్రాలు ఇచ్చాయి. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడమే మార్గమని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్ఎంఎస్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు పరిధిలో ఉండటంతో, రాబోయే తీర్పు ఆధారంగానే ఎన్నికల భవిష్యత్తు తేలనుంది.
పేదలకు సేవ చేయడమే రెడ్ క్రాస్ లక్ష్యం – కోల అన్నారెడ్డి, సభ్యుడు
పేదలకు సేవ చేయడం రెడ్ క్రాస్ లక్ష్యం. రానున్న ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గం డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మార్కెట్లో పేదలు అన్ని టెస్టులకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించాలి. రెడ్ క్రాస్ లో రక్తం విషయంలో తక్కువగా రూ.1250 యూనిట్ ధరకే ఇవ్వడం జరుగుతోంది. అదే విధంగా సేవ విషయంలో అనాథలకు విద్య, ఇళ్లు కోల్పోయిన వారికి తాడిపత్రిలు, టీబీ పేషెంట్లకు నిత్యావసర సరుకులు, తలసేమియా పేషెంట్లకు తోడ్పాటుతో పాటు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అత్యవసర రక్తదాన సేవలు అందించామని తెలిపారు.
ఆర్టీసీని విలీనం చేయాల్సిందే – రాజు, ఐఎన్టీయుసీ రీజియన్ ప్రెసిడెంట్
గత పదేళ్లుగా ఎన్నికలు జరిగిన దాఖలాలే లేవు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్టీసీలో యూనియన్ల గుర్తింపు కోసం ఎన్నికలు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఎన్నికలు పూర్తి కాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఊపందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలను విడతలుగా చెల్లిస్తుంది. ఆర్టీసీని సైతం ప్రభుత్వంలో విలీనం చేస్తుందనే నమ్మకం ఉంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

