భద్రాద్రి నియోజకవర్గాల్లో ముక్కలవుతున్న గులాబీ దళం!

కలం, ఖమ్మం బ్యూరో : ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్​ఎస్ (Bhadradri Kothagudem BRS)​ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర అంతర్మథనంలో కూరుకుపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ప్రతిపక్ష హోదాలో ప్రజల్లోకి వెళ్తూ, అధికార కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమించాల్సిన నాయకులు.. తమ సొంత అజెండాలు, ఆధిపత్య పోరు, కుటుంబ వారసత్వ వివాదాలతో పార్టీని నడిరోడ్డుపై నిలబెడుతున్నారు.

కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కుటుంబంలో చోటుచేసుకుంటున్న వారసత్వ రగడ నుంచి ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ముదిరిన వర్గపోరు వరకు ప్రతి అంశమూ జిల్లా బీఆర్‌ఎస్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. దీనికితోడు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై న్యాయస్థానాల తీర్పుల సెగ తగలడంతో భద్రాచలం రాజకీయం కూడా తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.

​కొత్తగూడెం నియోజకవర్గంపై సుదీర్ఘకాలం ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంట్లో ఇప్పుడు వారసత్వ మంటలు ఎగిసిపడుతున్నాయి. తదుపరి రాజకీయ వారసుడెవరనే ప్రశ్న తండ్రీకొడుకుల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. వనమా రాఘవ తన కూతురు అలేఖ్యను రాజకీయాల్లోకి తీసుకురావాలని పట్టుబడుతుండగా, మాజీ ఎమ్మెల్యే వనమా మాత్రం తన రెండో కుమారుడైన రామకృష్ణ కొడుకు సాయినాథ్‌ను రంగంలోకి దించాలని యోచిస్తున్నారు.

ఈ అంతర్గత విభేదాలు ఇటీవల నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో రాఘవ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తండ్రి వైఖరిపై ఆగ్రహంతో రాఘవ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారనే వార్తలు స్థానికంగా కలకలం రేపాయి.

​ఇక భద్రాచలం నియోజకవర్గం విషయానికి వస్తే, అక్కడ రాజకీయ చిత్రం మరిన్ని మలుపులు తిరుగుతోంది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిస్థితి ఇప్పుడు ‘త్రిశంకు స్వర్గం’లా తయారైంది. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో తెల్లం వెంకట్రావు తీవ్ర ఆందోళన, గందరగోళంలో మునిగిపోయారు.

రేపో మాపో తనపై కూడా అనర్హత వేటు పడుతుందేమోనన్న భయంతో ఆయన అనుచరుల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఒకవైపు సొంత నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన వైఖరిని ఎండగడుతుంటే, మరోవైపు న్యాయపరమైన రక్షణ లభించకపోతే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందనే దిగులు తెల్లం వెంకట్రావును వేధిస్తోంది. తీర్పుల భయంతో ఆయన అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు సొంత కేడర్‌తోనూ సరిగ్గా కలవలేక ఊగిసలాట ధోరణిలో పడిపోయారు.

​మరోవైపు ఇల్లందు నియోజకవర్గంలో ఆధిపత్య సమరం మరింత ముదిరి పాకాన పడింది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఒకవైపు, తెలంగాణ ఉద్యమ కాలం నుండి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నేత దిండిగల రాజేందర్ మరోవైపు పోటాపోటీ రాజకీయాలు నడుపుతున్నారు.

ఎవరికి వారే ఎమునా తీరే..

భవిష్యత్తు ఎన్నికల్లో టికెట్ రేసులో తామే ముందంజలో ఉండాలనే వ్యూహంతో ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారే ప్రత్యేక వర్గాలను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు కలిసి పనిచేయకపోగా, సమాంతరంగా బలప్రదర్శనలు చేస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఏ కార్యక్రమానికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు.

​అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్ పరిస్థితి మరీ విచిత్రంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై నిరసన తెలపాలని పార్టీ అధిష్టానం పిలుపునిస్తే, అక్కడ నేతలు దాన్ని సొంత బలాబలాల నిరూపణకు వేదికగా మార్చుకున్నారు. మండల కేంద్రంలో ఒకే రోజు, ఒకే అంశంపై మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వర్గం ఒకవైపు ర్యాలీ తీస్తే, ఆయన వ్యతిరేక వర్గమైన తాటి వెంకటేశ్వర్లు సహా ఇతర అసమ్మతి నేతలంతా ఏకమై మరొకవైపు పోటీగా ఆందోళన చేపట్టారు.

సొంత గూట్లోనే కత్తులు నూరుకుంటున్న భద్రాద్రి నేతలు!

నియోజకవర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తమను సంప్రదించకుండా, ఏకపక్షంగా కోఆర్డినేటర్‌ను నియమించారని ద్వితీయ శ్రేణి నేతల్లో రగులుతున్న అసంతృప్తే ఈ వీధిపోరాటాలకు కారణమని తెలుస్తోంది. ​మొత్తానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో ప్రత్యర్థులపై పోరాడాల్సిన నాయకులు సొంత గూట్లోనే కత్తులు నూరుకోవడం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత తీర్పుల భయంతో దిక్కుతోచని స్థితిలో పడటం జిల్లా రాజకీయాలను అల్లకల్లోలం చేస్తోంది. వ్యక్తిగత స్వార్థాలు, వారసత్వ వ్యామోహాలు, వర్గపోరుతో ముక్కలవుతున్న గులాబీ దళాన్ని రక్షించుకోవాలంటే అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>