కన్నీళ్ల మధ్య కొమురయ్య నేత్రదానం.. మరో ఇద్దరికి చూపు

కలం, కరీంనగర్ బ్యూరో: ఆ ఇంట్లో కన్నీళ్లు ఆగలేదు.. ఆప్తుడి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయినా అదే సమయంలో తీసుకున్న ఓ నిర్ణయం.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ‘ఆయన ఇక మన మధ్య లేకపోయినా.. ఆయన కళ్లతో ఇంకొందరు ప్రపంచాన్ని చూడాలి’ అన్న ఆలోచనతో చింతల కొమురయ్య కుటుంబం నేత్రదానానికి ముందుకొచ్చింది.

కరీంనగర్‌ బొమ్మకల్‌ (Bommakal)లోని గోకుల్‌నగర్‌కు చెందిన చింతల కొమురయ్య (58) గోదావరిఖని గౌతమినగర్‌ లోని టీజీఎస్పీడీసీఎల్‌ సబ్‌స్టేషన్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో ఆయన దగ్గరి బంధువు, సీనియర్‌ జర్నలిస్ట్‌, పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్‌ యూనియన్‌ ఎథిక్స్‌ కమిటీ కో-కన్వీనర్‌ పందిళ్ల శ్యామ్‌సుందర్‌ నేత్రదానం ప్రాధాన్యాన్ని వారికి వివరించారు.

మరణించిన వ్యక్తి నేత్రాలను దానం చేస్తే ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించే అవకాశం ఉంటుందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్‌ జాతీయ ప్రచార కార్యదర్శి కే.ఎస్‌.వాసు ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్‌ ఐ బ్యాంక్‌ సీనియర్‌ టెక్నీషియన్‌ సతీష్‌కుమార్‌ కొమురయ్య నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు.

కన్నీళ్ల మధ్య.. కళ్ల దానం

కొమురయ్య భార్య పద్మ, కొడుకు–కోడలు సతీష్‌–భార్గవి, కుమార్తెలు–అల్లుళ్లు సౌమ్య–ప్రమోద్‌, స్వప్న–సాయి కలిసి తీసుకున్న ఈ నిర్ణయం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఆప్తుడిని కోల్పోయిన బాధలోనూ.. మరొకరి జీవితంలో వెలుగు నింపాలనే ఆలోచనకు ప్రాధాన్యమివ్వడం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది.

అభినందించిన సదాశయ ప్రతినిధులు..

కొమురయ్య కుటుంబ సభ్యుల మానవీయ నిర్ణయాన్ని సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేష్‌, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, వెల్దీ కవిత అనంతరాములు, ఆరెల్లి రాజమౌళి, లక్ష్మీనారాయణ, తాడబోయిన రాములు, శశికళ, అన్నపూర్ణ తదితరులు అభినందించారు.

ఒకరి మరణం.. ఇద్దరి జీవితాల్లో వెలుగు

కొమురయ్య కుటుంబం చూపిన ఈ మానవీయత.. నేత్రదానం పట్ల సమాజంలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. మనిషి ఈ లోకాన్ని విడిచివెళ్లినా.. తన చూపును మరొకరికి అందించి వారి జీవితంలో వెలుగుగా నిలవొచ్చనే సందేశాన్ని ఈ కుటుంబం చాటిచెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>